తాలిబన్ల ఆధీనంలోకి కాందహార్ నగరం.. ఇక మిగిలింది కాబూల్ మాత్రమే

Taliban captures Afghanistan's second largest city Kandahar.ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ‌లు కొన‌సాగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Aug 2021 3:25 AM GMT
తాలిబన్ల ఆధీనంలోకి కాందహార్ నగరం.. ఇక మిగిలింది కాబూల్ మాత్రమే

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని త‌మ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఇప్ప‌టికే చాలా న‌గ‌రాల‌ను త‌మ ఆధీనంలోకి తెచ్చుకోగా.. దేశంలో రెండో అతి పెద్ద న‌గ‌ర‌మైన కాంద‌హార్ కూడా వారి వ‌శ‌మైంది. ఈ మేరకు తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. ఇక ప్రభుత్వ ఆధీనంలో కేవలం రాజధాని కాబూల్‌, మరో ప్రావిన్స్‌ మాత్రం మిగిలి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాలిబ‌న్ల‌తో అధికారం పంచుకునేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. హింస‌ను ప‌క్క‌న‌పెడితే.. స‌యోధ్య‌కు సిద్ద‌మ‌ని ప్ర‌తిపాద‌న పంపింది. కాగా.. ఈ ప్ర‌తిపాద‌న‌పై తాలిబ‌న్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లోని తొమ్మిది ప్రావిన్సుల రాజధానులను ఆక్రమించిన తాలిబన్లు గురువారం కొత్తగా ఘాజ్నీ, హేరట్‌ ప్రావిన్సులను తమ ఖాతాలో వేసుకున్నారు. తాజా ఆక్రమణతో దేశంలో మూడింట రెండొంతుల భాగం తాలిబన్ల చెరలోకి వెళ్లినట్లయింది. తాలిబన్ల రాకతో కాందహార్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ భద్రత దళాలు వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం చేతిలో ఉన్న ఏకైక పెద్ద నగరం ఆ దేశ రాజధాని కాబూల్ మాత్రమే. కాబూల్‌ను స్వాధీనం చేసుకుంటే దాదాపు ఆప్ఘానిస్తాన్ మొత్తాన్ని తాలిబన్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లే భావించవచ్చు. భద్రత బలగాలు ఎక్కడా వారికి ఎదురు నిలవలేకపోతున్నాయి. పరిమితంగా ఉన్న అమెరికా సైన్యం అక్కడక్కడా వైమానిక దాడులు జరుపుతున్నప్పటికీ, అవేమీ తాలిబన్లను నిలువరించలేకపోతున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న తాలిబన్లను.. ఎవ‌రైనా ప్ర‌జ‌లు త‌మ‌ను వ్య‌తిరేకిస్తే వారిని కిరాత‌కంగా హ‌త్య‌లు చేస్తున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నత‌మ పౌరుల‌ను అన్ని దేశాలు వెన‌క్కి ర‌ప్పిస్తున్నాయి. ఆఫ్ఘాన్‌లో ఉన్న భారతీయులంతా వీలైనంత త్వరగా తిరిగి వెనక్కి రావాలని భారత్ ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు అడ్వైజ‌రీ జారీ చేయ‌గా.. తాజాగా నాలుగో అడ్వైజరీని కూడా జారీచేసింది. ఆప్ఘానిస్తాన్‌లో ఇప్పటికీ 1,500 మంది భారతీయుులు ఉన్నారని తెలుస్తోంది. వారిని వెనక్కి రప్పించేందుకు విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది.

Next Story