స్టైలిష్ హెయిర్ కటింగ్స్, క్లీన్ షేవ్ పై నిషేదం..!
Taliban ban barbers in Helmand from shaving and trimming beards.అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైన సంగతి
By తోట వంశీ కుమార్ Published on 27 Sep 2021 9:56 AM GMT
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైన సంగతి తెలిసిందే. వీరి పాలనలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అఫ్గాన్ ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు. తాలిబన్లు పైకి తాము మారిపోయామంటూ శాంతి వచనాలను వల్లిస్తూనే.. తాము చేసే పనులు వారు చేస్తున్నారు. గతంలో వీరు ఎలాంటి పాలనను చేశారో.. మళ్లీ అలాంటి పాలననే కొనసాగిస్తున్నారు. మహిళలపై స్వేచ్చపై ఉక్కుపాదం మోపారు. వీరి పాలనపై ఇతర దేశాలు ప్రశ్నించకముందే.. ఇది తమ అంతర్గత పాలన అని.. ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని తాలిబన్ల నేతలు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు.
ఇక తాలిబన్లు నిషేదిస్తున్న జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా.. హెయిర్ కటింగ్, క్లీన్ షేవ్‌ను కూడా నిషేదించినట్లు అక్కడి మీడియా తెలిపింది. దక్షిణ అఫ్గానిస్థాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో వీటిపై నిషేదం విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇస్లామిక్ ఓరియంటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రావిన్షియల్ రాజధాని లష్కర్ గాహ్‌లో మెన్స్ హెయిర్ సెలూన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్టైలిష్ హెయిర్‌స్టైల్స్, గడ్డంషేవింగ్, ట్రిమ్మింగ్ లను చేయవద్దని పేర్కొన్నారు. అంతేకాదు.. కటింగ్ షాపుల్లో షేవింగ్ లేదా కటింగ్ చేసే సమయంలో ఎలాంటి సంగీతం వినిపించకూడదని హుకుం జారీ చేశారు. ఈ నిషేధం వల్ల తమ జీవితాలు కష్టాల్లోకి నెట్టివేయబడినట్లు అక్కడి బార్బర్‌లు తెలిపినట్లు మీడియా వెల్లడించింది.