సాధారణంగా మనుషులలో తమ కుటుంబ సభ్యులు పట్ల ఎంతో ప్రేమ అనురాగాలు ఉంటాయి.కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోతుంది. అచ్చం మనుషులు లాగే పక్షులు, జంతువులకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయని చెప్పవచ్చు. సాధారణంగా ఏదైనా ఒక పక్షికి ప్రమాదం వాటిల్లితే దాని చుట్టూ ఉన్న పక్షులు అక్కడికి గుంపులుగా ఏర్పడతాయి. ఇలాంటి సంఘటనలను మనం ఎన్నో చూసి ఉంటాం. అచ్చం ఇలాంటి సంఘటనే తాజాగా జర్మనీలో చోటుచేసుకుంది..
పూర్తి వివరాల్లోకి వెళితే ఎంతో అందమైన రెండు హంసలు (స్వాన్) ఆకాశంలో విహరిస్తూ ఉన్నాయి. అయితే అందులో ఒక హంస హై స్పీడ్ రైల్వే లైన్ లకు ఉన్న విద్యుత్ తీగలను తగిలి పట్టాలపై మరణించింది. ఈ విధమైన పరిణామం చోటు చేసుకోవడం వల్ల మరో హంస తన తోడును కోల్పోయి ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ తన తోడు కోసం వెతుకుతూ రైల్వే పట్టాలపై తిరుగుతోంది.
రైల్వే పట్టాలపై సంచరిస్తున్న ఈ హంసను గుర్తించిన అధికారులు ఆ హంసను పట్టుకోవడానికి దాదాపు 50 నిమిషాల పాటు శ్రమించారు. చివరికి ఆ హంసను పట్టుకుని అనంతరం దానిని నీటిలో వదిలారు. ఈ 50 నిమిషాల సమయంలో ఆ రైల్వే ట్రాక్ గుండా దాదాపు 23 రైళ్లు ప్రయాణించాల్సి ఉండగా,ఆ రైళ్లు అన్నింటిని అధికారులు ఆలస్యంగా నడిపారు. అయితే అక్కడ ఉన్న మరికొందరు మాత్రం తోడు కోల్పోయి తన తోడు కోసం వెతుకుతున్న ఆ హంస ఫోటోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ హంస కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకర్షిస్తున్నాయి.