లంకలో ఎమర్జెన్సీ.. శుక్రవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి
State of emergency declared in Sri Lanka as strike halts country.ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక అతలాకుతలం
By తోట వంశీ కుమార్ Published on 7 May 2022 10:28 AM ISTఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక అతలాకుతలం అవుతోంది. దీంతో అక్కడి ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ నేపథ్యంలో తమకు ఈ పరిస్థితి రావడానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నే కారణమని భావించిన ప్రజలు.. పెద్ద సంఖ్యలో రోడ్డపైకి వచ్చి రాజపక్స వెంటనే రాజీనామా చేయాలని ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో లంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లంకలో ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థితి) విధించింది.
శుక్రవారం అర్థరాత్రి నుంచే ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. ప్రజల భద్రతతో పాటు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. లంకలో గత ఐదువారాల్లో రెండోసారి ఎమర్జెన్సీ ప్రకటించడం గమనార్హం. ఎమర్జెన్సీ ద్వారా పోలీసులకు, భద్రతా సిబ్బందికి ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయి. ఎవరినైనా నిర్బంధించేందుకు, అరెస్టు చేసేందుకు వీలుంటుంది.
మరోవైపు గోటబయా రాజీనామాను డిమాండ్ చేస్తున్న విద్యార్థులు.. తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి పార్లమెంటు సమావేశాలు పునఃప్రారంభం కానుండగా.. అదే రోజు పార్లమెంటును ముట్టడిస్తామన్నారు. ఈ లోపే అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిర్వహించిన సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పనులకు దూరంగా ఉంటున్నారు. దాదాపుగా రైలు సర్వీసులన్నీ రద్దు చేశారు. ప్రైవేట్ యాజమాన్యంలోని బస్సులు రోడ్లపైకి రాలేదు, పారిశ్రామిక కార్మికులు తమ ఫ్యాక్టరీల వెలుపల ప్రదర్శనలు చేశారు. అప్పుల ఊబిలోకి నెట్టేసిన చేతకానీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నల్లజెండాలు ఎగరేశారు. కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా వేలాదిమంది విద్యార్థులు కొలంబోలో పార్లమెంటుకు వెళ్లే ప్రధాన రహదారులను 24 గంటలపాటు దిగ్బంధించారు.