Yemen Stampede: యెమెన్ రాజధానిలో తొక్కిసలాట.. 85 మందికిపైగా మృతి
అరేబియా దేశాల్లో ఒకటైన యెమెన్ దేశంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 85 మందికిపైగా మృతి చెందారు. 322 మందికిపైగా
By అంజి Published on 20 April 2023 2:47 AM
Yemen Stampede: యెమెన్ రాజధానిలో తొక్కిసలాట.. 85 మందికిపైగా మృతి
అరేబియా దేశాల్లో ఒకటైన యెమెన్ దేశంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 85 మందికిపైగా మృతి చెందారు. 322 మందికిపైగా గాయపడ్డారు. యెమెన్ రాజధానిలో సనాలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. హౌతీ ఆధ్వర్యంలోని ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రకారం.. సనా మధ్యలో ఉన్న ఓల్డ్ సిటీలో వందలాది మంది పేదలు.. వ్యాపారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుమిగూడడంతో క్రష్ జరిగింది. పవిత్ర రంజాన్ సందర్భంగా రాజధానిలోని బాల్ అల్ - యెమెన్ ప్రాంతంలో ఓ చారిటీ ఆర్గనైజేషన్ ప్రజలకు ఆర్థిక సాయం చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీంతో 85 మందికిపైగా మృతి చెందారు.
మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారని హౌతీ సెక్యూరిటీ ఆఫీసర్ తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ముస్లింల సెలవుదినం అయిన ఈద్ అల్-ఫితర్ ముందు ఈ విషాదం జరిగింది, ఇది ఈ వారంలో ఇస్లామిక్ పవిత్ర మాసమైన రంజాన్ ముగింపును సూచిస్తుంది. ప్రత్యక్ష సాక్షులు అబ్దెల్-రహ్మాన్ అహ్మద్, యాహియా మొహసేన్ మాట్లాడుతూ.. సాయుధ హౌతీలు గుంపును నియంత్రించే ప్రయత్నంలో గాలిలోకి కాల్పులు జరిపారని, స్పష్టంగా విద్యుత్ తీగకు తగిలి అది పేలిపోయిందని చెప్పారు. అది భయాందోళనలకు దారితీసింది. దీంతో తొక్కిసలాట జరిగిందని వారు చెప్పారు. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. యెమెన్ రాజధాని ఇరాన్ మద్దతుగల హౌతీల నియంత్రణలో ఉంది.