విషాదం.. చర్చిలో తొక్కిసలాట.. 29 మంది మృతి
Stampede at Liberia church gathering kills 29.పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియా దేశంలో విషాదం చోటు చేసుకుంది. ఓ చర్చిలో
By తోట వంశీ కుమార్ Published on 21 Jan 2022 4:01 AM GMTపశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియా దేశంలో విషాదం చోటు చేసుకుంది. ఓ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందారు. ఈ ఘటన లైబీరియా రాజధాని మన్రోవియాలో చోటు చేసుకుంది. మరణించిన వారిలో 11 మంది చిన్నారులతో పాటు ఓ గర్భిణీ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రాజధాని శివార్లలోని పొరుగున ఉన్న న్యూ క్రూ టౌన్‌లో రాత్రి జరిగిన క్రిస్టియన్ ఆరాధన కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగిందని లైబీరియా డిప్యూటీ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి జలవా టోన్‌పో చెప్పారు. ఈ తొక్కిసలాటలో 29 మంది మరణించగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. దోపిడికి యత్నించిన ఓ గుంపును సాయుధ వ్యక్తుల బృందం వెంటాడడంతో వారు చర్చిలోనికి ప్రవేశించడంతో తొక్కిసలాట ప్రారంభమైందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
చర్చిలోకి దుండగులు ప్రవేశించడం వారి వెనుకనే సాయుధ వ్యక్తుల బృందం రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. దీంతో అక్కడ ఉన్నవారు పరుగులు తీశారు. కొంతమంది కిందపడగా.. వారిపై నుంచే పరుగులు తీయడంతో వారు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనకు కారణమేమిటనే దానిపై వ్యాఖ్యానించేందుకు లైబీరియా దేశ పోలీసు ప్రతినిధి మోసెస్ కార్టర్ నిరాకరించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని మాత్రమే చెప్పారు.