దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స‌

Sri Lankan president flees to Maldives hours before he was due to step down.శ్రీలంక అధ్యక్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స దేశం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 July 2022 3:29 AM GMT
దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స‌

శ్రీలంక అధ్యక్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స దేశం విడిచి పారిపోయారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున భార్య‌, ఇద్ద‌రు బాడీగార్డుల‌తో క‌లిసి ఆంటోనోవ్ 32 అనే సైనిక విమానంలో మాల్దీవుల రాజ‌ధాని మాలేకు ఆయ‌న వెళ్లిన‌ట్లు ఇమ్మిగ్రేష‌న్ అధికారులు తెలిపారు. కాగా.. అక్క‌డి ప్ర‌భుత్వం రాజ‌ప‌క్ష‌కు వెల‌నా విమానాశ్ర‌యంలో స్వాగ‌తం ప‌లికిన‌ట్లు తెలుస్తోంది.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లంక‌లో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గొట‌బాయ రాజ‌ప‌క్స అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తూ అధ్య‌క్ష భ‌వ‌నంలోకి చొచ్చుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌మాదాన్ని ముందే ప‌సిగ‌ట్టిన గొట‌బాయ.. ఆందోళ‌న కారులు భ‌వ‌నంలోకి రాక‌ముందే అక్క‌డి నుంచి ప‌రారు అయ్యారు. ఎక్క‌డి వెళ్లార‌నేది ఎవ్వ‌రికి తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఈ క్ర‌మంలో జూలై 13న‌( బుధ‌వారం) అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే.. మంగ‌ళ‌వారం త‌న‌ను దేశం వీడి పోయేందుకు అనుమ‌తిస్తేనే ప‌ద‌వి నుంచి వైదొలుగుతాన‌ని మాట మార్చారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం ఆయ‌న దేశం వీడి వెళ్లిపోయారు. అయితే.. ఆయ‌న ఇంకా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు.

ప్ర‌భుత్వ ఏర్పాటుకు విప‌క్షాల స‌న్నాహాలు

మ‌రోవైపు అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స ఏక్ష‌ణంలోనైనా రాజీనామా చేసే అవ‌కాశం ఉండ‌డంతో అఖిల‌ప‌క్ష ప్ర‌భుత్వ ఏర్పాటుకు విప‌క్ష పార్టీలైనా ఎస్‌జేబీ, ఎస్ఎల్ఎఫ్‌ఫీ నేత‌లు సంప్ర‌దింపుల‌ను ముమ్మ‌రంచేశారు. ఎస్‌జేబీ నేత సాజిత్ ప్రేమ‌దాస తాత్కాలిక అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు ఇప్ప‌టికే అంగీకారం తెలిపారు.

Next Story