ప్ర‌మాణ స్వీకారం చేసిన కొన్ని గంట‌ల్లోనే నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం..!

Sri Lankan forces raid anti-government protest camp as new president takes office.ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తీవ్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2022 5:48 AM GMT
ప్ర‌మాణ స్వీకారం చేసిన కొన్ని గంట‌ల్లోనే  నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం..!

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న శ్రీలంక‌లో మ‌ళ్లీ ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. లంక కొత్త అధ్య‌క్షుడిగా ర‌ణిల్ విక్ర‌మ సింఘే ప్ర‌మాణ స్వీకారం చేసిన కొన్ని గంట‌ల్లోనే నిర‌స‌న కారుల‌పై భ‌ద్ర‌తాబ‌ల‌గాలు విరుచుకుప‌డ్డాయి. వంద‌ల మంది భ‌ద్ర‌తాబ‌ల‌గాలు, పోలీసులు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేస్తున్న కొలంబోలోని ప్ర‌ధాన క్యాంప్ పై గురువారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత దాడులు చేప‌ట్టారు.

ఆందోళ‌న కారులకు చెందిన ప‌లు టెంట్ల‌ను తొల‌గించారు. అధ్యక్షుడి సెక్రెటేరియట్‌ భవనం ముందు నిరసనకారులు ఏర్పాటు చేసిన శిబిరాలను తీసివేశాయి.ఈ క్ర‌మంలో దాదాపు 50 మంది వ‌ర‌కు ఆందోళ‌న కారులు గాయ‌ప‌డ్డారు. అయితే.. ఎవ్వ‌రూ ఏం చేసినా స‌రే తాము వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని ఆందోళ‌న‌కారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 9 నుంచి అధ్య‌క్ష కార్యాల‌య ప్ర‌వేశ ద్వారాన్ని మూసివేశామ‌ని, కొత్త అధ్య‌క్షుడు ర‌ణీల్ విక్ర‌మ సింఘే రాజీనామా చేసే వ‌ర‌కు త‌మ నిర‌స‌న‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

నిర‌స‌న బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న లాహీరు వీర‌సేక‌ర మాట్లాడుతూ.. ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ప్పుడు త‌మ‌కు విజ‌యం సాధ్య‌మ‌ని అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి చేశారని ఆరోపించారు. అధ్య‌క్ష భ‌వ‌నం స‌మీపంలో త‌మ‌కు నిర‌స‌నలు చేప‌ట్టేందుకు చోటు చూపించాల‌ని డిమాండ్ చేశారు. నీచ రాజ‌కీయాల నుంచి దేశాన్ని విడిపించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు.

Next Story