కిలో బంగాళదుంప రూ.200, టమాట రూ.150
Sri Lanka economic crisis Potato cost over Rs 200, tomato price at Rs 150.తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో
By తోట వంశీ కుమార్ Published on 12 July 2022 1:05 PM ISTతీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకి మరింత దిగజారిపోతున్నాయి. నిత్యాసరాల ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడు వంట చేయడానికే భయపడే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. కిలో బియ్యం ధర ఏడాది క్రితం రూ.145(లంక కరెన్సీలో) ఉండగా..ప్రస్తుతం రూ.230కి చేరింది. ఇక కూరగాయల ధరలు ఇప్పటికే రెండింతలకు పైగా పెరిగాయి. ఉల్లి ధర కిలోకు రూ.200 కాగా.. బంగాళదుంప ధర రూ.220కి చేరింది. కిలో టమాట రూ.150 పలుకుతోంది. కిలో క్యారెట్(రూ.490) ఏకంగా ఐదువందలకు చేరువైంది. గ్రామ్ వెల్లుల్లి రూ.160కి విక్రయిస్తుండడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
1948లో శ్రీలంక కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఇంతకముందు ఎన్నడూ ఎదుర్కొనలేదు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇక లీటర్ పెట్రోల్ ధర రూ.500 దాటేసింది. అయినప్పటికీ దొరకుతుందన్న గ్యారెంటి లేదు. బ్లాక్ లో అయితే రెండు వేలు దాటేసింది. దీంతో కూరగాయల ఉత్పత్తులు తీసుకురావడం, వాటిని సురక్షితంగా ఉంచడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని దీంతో ధరలు పెంచకతప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. అన్ని పార్టీలు కలిసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిన తరువాత మంత్రి వర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని రణిల్ విక్రమసింఘే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.