పాపం ఇమ్రాన్ ఖాన్.. గెస్ట్ గా వెళ్లి మాట్లాడాలని అనుకుంటే కూడా..!

Sri Lanka Drops Imran Khan's Parliament Speech. శ్రీలంక పర్యటనలో ఆ దేశ పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాల్సి ఉన్నా.. ఆయన ప్రసంగాన్ని రద్దు చేసేశారు

By Medi Samrat  Published on  22 Feb 2021 6:43 PM IST
Sri Lanka Drops Imran Khans Parliament Speech

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఎప్పుడు ఏ విషయం మాట్లాడుతాడో.. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన గతంలో చాలా కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలు అలాంటివే..! తాజాగా శ్రీలంక పర్యటనలో ఆ దేశ పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాల్సి ఉన్నా.. ఆయన ప్రసంగాన్ని రద్దు చేసేశారు. శ్రీలంక‌ పర్యటనలో భాగంగా అక్కడి పార్ల‌మెంట్‌లో ఇమ్రాన్ ఖాన్ ఇవ్వాల్సిన ప్ర‌సంగాన్ని ఆ దేశం ర‌ద్దు చేసింది. భారత్‌తో ఎలాంటి వివాదం తలెత్తవద్దన్న ఉద్ధేశ్యంతోనే శ్రీలంక ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు కొలంబో గెజిట్ ప‌త్రిక త‌న క‌థ‌నంలో ప్రచురించింది.

భారత్‌ శ్రీలంకకు కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌లను అందిస్తోంది. ఇప్పటికే 5 లక్షల కోవిషిల్డ్‌ డోసులను ఆ దేశానికి పంపించింది. ఇలాంటి సమయంలో భారత్‌తో తమకున్న దౌత్య సంబంధాన్ని పణంగా పెట్టేందుకు శ్రీలంక సిద్ధంగా లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తూ ఉన్నారు.

ఇమ్రాన్ ఖాన్‌ అంతర్జాతీయ వేదికలపై జమ్మూకశ్మీర్‌పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అయితే శ్రీలంకలో కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ జమ్మూకశ్మీర్ అంశం లేవనెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రసంగం రద్దు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొలంబో పోర్టులోని ఈస్ట్ కంటైనర్ టర్మినల్ నిర్మాణం కోసం భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని శ్రీలంక ఇటీవలే రద్దు చేయడం వెనుక చైనా హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక పార్లమెంట్‌లో పాక్ ప్రధాని నోట కశ్మీర్ ప్రస్తావన వస్తే.. శ్రీలంక-భారత్ దేశాల దౌత్యసంబంధంపై మరింత ప్రభావం పడుతుందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Next Story