తైవాన్ దేశంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కవోసియుంగ్ నగరంలోని 13 అంతస్తుల భవనంలో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 46 మంది ఆగ్ని ఆహుతి అయ్యారు. మరో 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మృతదేహాలను మార్చురీకి తరలించినట్లు అగ్నిమాపక అధికారి లి చింగ్ హ్సియు సంఘటనా స్థలంలోని విలేఖరులకు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని 40 ఏళ్ల క్రితం నిర్మించారు. మంటల ధాటికి భవనంలోని చాలా అంతస్తులు ధ్వంసం అయినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ భవనంలో కింద షాపులు ఉండగా, పై అంతస్తుల్లో కుటుంబాలు ఉంటున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పేలుడు శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.