రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. రెండేళ్ల తరువాత
South Africa lifts curfew as Omicron wave subsides.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 31 Dec 2021 3:32 PM ISTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా ప్రాన్స్, అమెరికా, యూకే వంటి దేశాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో చాలా దేశాలు మళ్లీ ఆంక్షల వైపు అడుగువేస్తున్నాయి. ఇక మనదేశంలోనూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో మాత్రం రాత్రి పూట కర్ఫ్యూని ఎత్తివేశారు.
ఆ దేశంలో నాలుగో వేవ్ తగ్గుముఖం పట్టడంతో దాదాపు రెండేళ్లుగా అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాదు ప్రజల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని తెలిపారు. దేశంలో కరోనా తాజా పరిస్థితులపై నేషనల్ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్(ఎన్‌సీసీసీ), ప్రెసిడెంట్స్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్(పీసీసీ) సమావేశాల అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్య సైతం పెంచడం గమనార్హం.
నాలుగో వేవ్ తగ్గినప్పటికీ.. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు కొనసాగుతున్నాయని తెలిపింది. దేశంలో గల 9 ప్రావిన్సుల్లో రెండు మినహా మిగతా అన్నింటిలో కేసులు తగ్గాయని చెప్పింది. పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ కారణంగా నాలుగో వేవ్ ఉద్దృతి నుంచి బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్ఫష్టం చేసింది. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి వాటిని పాటించాలని కోరింది. ఇక దేశంలో 12 సంవత్సరాలు, ఆపైబడిన చిన్నారులందరికీ వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులను కోరింది.