టిక్‌టాక్ కార‌ణంగా అమెరికాలో పాఠ‌శాల‌లు మూసివేత‌.!

Some US schools closed as viral TikTok challenge warns of shooting.ప్ర‌ముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Dec 2021 9:56 AM IST
టిక్‌టాక్ కార‌ణంగా అమెరికాలో పాఠ‌శాల‌లు మూసివేత‌.!

ప్ర‌ముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ను భార‌త్‌లో బ్యాన్ చేసిన‌ప్ప‌టికి అమెరికా స‌హా చాలా దేశాల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. అయితే.. టిక్‌టాక్ కార‌ణంగా శుక్ర‌వారం అమెరికా వ్యాప్తంగా పాఠ‌శాల విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వ‌ణికిపోయారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఏంటంటే..డిసెంబర్ 17( శుక్రవారం) పాఠ‌శాల్లో కాల్పులు జ‌రుపుతామ‌ని, బాంబులు పేల్చుతామంటూ హెచ్చ‌రిక‌ల‌తో కూడిన వీడియోలు టిక్‌టిక్‌లో వైర‌ల్‌గా మార‌డ‌మే. దీంతో కాలిఫోర్నియా, టెక్సస్‌, మిన్నెసోటా తదితర రాష్ట్రాల్లో పాఠ‌శాల‌ల‌ను మూసివేయ‌గా.. మిగతా రాష్ట్రాల్లో స్కూల్‌ యాజమాన్యాల ఫిర్యాదుతో ఆయా పాఠ‌శాల‌ల వ‌ద్ద భారీగా పోలీసులు మోహరించాయి.

అమెరికాలో ఇటీవ‌ల గ‌న్ క‌ల్చ‌ర్ బాగా పెరిగిపోయిన నేప‌థ్యంలో.. విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందారు. దీంతో కొంత మంది త‌మ చిన్నారుల‌ను శుక్ర‌వారం పాఠ‌శాల‌ల‌కు పంపేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. కాగా.. బెదిరింపు వీడియోల‌కు సంబంధించి త‌మ‌కు చాలా ఫిర్యాదులు అందాయ‌ని స్థానిక పోలీసులు చెప్పారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఈ ముప్పును పరిశోధించాయని.. ఈ వీడియో అరిజోనాలో పోస్ట్ చేశార‌ని.. ఇది ఫేక్ వీడియో అని నిర్ధారించారు అని బాల్టిమోర్ కౌంటీ పబ్లిక్ స్కూల్స్ ట్విట్టర్‌లో రాశాయి. న్యూజెర్సీలో గవర్నర్ ఫిల్ మర్ఫీ ట్వీట్ చేస్తూ, "న్యూజెర్సీ పాఠశాలలకు వ్యతిరేకంగా నిర్దిష్ట బెదిరింపులు లేవు అని ట్వీట్ చేశారు.

అయితే.. పాఠ‌శాల్లో కాల్పులు జ‌రుపుతామ‌నే హెచ్చ‌రిక‌ల‌తో కూడిన వీడియో వ్యాప్తిపై టిక్‌టాక్ భిన్నంగా స్పందించింది. అటువంటి హెచ్చ‌రిక‌ల‌తో కూడిన వీయోల‌ను తాము గుర్తించ‌లేద‌ని చెప్పింది. హెచ్చరికలతో కూడిన వీడియోల వ్యాప్తిపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. "టిక్‌టాక్ ద్వారా అటువంటి బెదిరింపులు ఉద్భవించిన‌ట్లు లేదా వ్యాప్తి చెందుతున్నట్లు ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు" అని టిక్‌టాక్ ట్వీట్ చేసింది. ఒక‌వేళ అటువంటి హెచ్చ‌రిక‌లు క‌నుక వ‌స్తే.. చ‌ట్ట‌ప్రకారం న‌డుచుకుంటామ‌ని తెలిపింది.

Next Story