ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. సోషల్‌ మీడియాపై నిషేధం.. వ్యతిరేకించిన మంత్రి

Social media platforms blocked in Sri Lanka amid curfew.ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంక దేశంలో ప్రజా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2022 7:25 AM GMT
ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. సోషల్‌ మీడియాపై నిషేధం.. వ్యతిరేకించిన మంత్రి

ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంక దేశంలో ప్రజా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. దీంతో వాటిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్య‌మాల‌పై నిషేదం విధించింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శ‌నివారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాట్సాప్‌, ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ స‌హా ఇత‌ర సోష‌ల్ మీడియా సేవ‌లు అక్క‌డ నిలిచిపోయాయి.

గ‌త కొంత‌కాలంలో లంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. విదేశీ మారక నిల్వ‌ల కొర‌త‌తో దిగుమ‌తుల‌పై ప్ర‌భుత్వం నిషేదం విధించింది. ఫ‌లితంగా దేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. చ‌మురు కొర‌త ఏర్ప‌డింది. ఫ‌లితంగా చాలా చోట్ల ప్ర‌జా ర‌వాణా స్తంభించింది. జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తమైంది. దీంతో సంక్షోభ నివార‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందంటూ పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు రోడ్డెక్కారు. ఈ క్రమంలో అధ్యక్ష భవనం ఎదుట గురువారం రాత్రి ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

దేశంలోని చాలా చోట్ల ఇలాంటి ప‌రిస్థుతులే నెల‌కొన‌డంతో శుక్ర‌వారం రాత్రి అధ్య‌క్షుడు రాజపక్స దేశంలో ఎమర్జెన్సీ ని విధించారు. సంక్షోభానికి త‌మ నిర్ణ‌యాల ఫ‌లితం కాద‌ని.. క‌రోనా మ‌హ‌మ్మారి మూలంగానే ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిని విదేశీ మార‌క నిల్వ‌లు క‌రిపోయాన‌ని ప్ర‌భుత్వం త‌మ చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించ‌న‌ని ఆదేశ యువజన, క్రీడా శాఖ మంత్రి నమల్‌ రాజపక్స అన్నారు. ఇలాంటి ఆంక్షలు అస్సలు పనిచేయవన్నారు. అధికారులు మరింత ప్రగతిశీలంగా ఆలోచించాలని, నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.

Next Story