టారిఫ్‌ల నుంచి వాటికి మినహాయింపు..ట్రంప్ కీలక ప్రకటన

టారిఫ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపునిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

By Knakam Karthik
Published on : 13 April 2025 2:47 AM

International News, America President Donald Trump, Reciprocal Tariffs, Smartphones Laptops Chips Exempted

టారిఫ్‌ల నుంచి వాటికి మినహాయింపు..ట్రంప్ కీలక ప్రకటన

టారిఫ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపునిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా టారిఫ్‌ల పేరిట ప్రపంచ దేశాల గుండెల్లో ట్రంప్ గుబులు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా చైనాను టార్గెట్ చేసుకుని సుంకాల మోత మోగిస్తున్నారు. చైనా తప్పించి... వివిధ దేశాలపై టారిఫ్ ల అమలుకు 90 రోజుల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పరస్పర సుంకాల నుంచి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, చిప్ లకు మినహాయిపునిచ్చారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ఆపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

గతంలో చైనా దిగుమతులపై భారీ సుంకాలు విధించాలనే ట్రంప్ నిర్ణయం టెక్నాలజీ దిగ్గజాలైన ఆపిల్ వంటి సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆపిల్ చాలా ఉత్పత్తులను చైనాలోనే తయారు చేస్తున్నందున ఈ నిర్ణయం ఆ సంస్థకు ప్రతికూలంగా మారుతుందని భావించారు. తాజా ప్రకటనతో ఆందోళనలు తొలగిపోయాయి. యూఎస్ కస్టమ్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ మినహాయింపు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, సెమీకండక్టర్లకు వర్తిస్తుంది. సాధారణంగా ఈ వస్తువులు అమెరికాలో తయారు చేయరు. దేశీయంగా వీటిని ఉత్పత్తి చేసేందుకు చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.

సెమీకండక్టర్లను తయారు చేయడానికి ఉపయోగించే యంత్రాలకు కూడా ట్రంప్ కొత్త సుంకాల నుంచి మినహాయింపు లభించనుంది. అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన తైవాన్ సెమీకండక్టర్ కార్పొరేషన్ తో పాటు ఇతర చిప్ తయారీదారులకు కూడా ఈ నిర్ణయం వెసులుబాటు కలిగిస్తోంది. ట్రంప్ సెక్టోరల్ సుంకాలు ఇప్పటివరకు 25%గా ఉన్నాయి. సెమీకండక్టర్లు, సంబంధిత ఉత్పత్తులపై ఎంత శాతం సుంకం ఉంటుందో ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story