ఇండియా వెళ్లిపో..ఐర్లాండ్‌లో ఆరేళ్ల చిన్నారిపై జాత్యంహకార దాడి
ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలిక జాత్యహంకార దాడి జరిగింది
By Knakam Karthik
ఇండియా వెళ్లిపో..ఐర్లాండ్‌లో ఆరేళ్ల చిన్నారిపై జాత్యంహకార దాడి
ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలిక జాత్యహంకార దాడి జరిగింది. కొంతమంది అబ్బాయిలు "భారతదేశానికి తిరిగి వెళ్ళు" అని అరుస్తూ ఆమెపై దారుణంగా దాడి చేశారు. దాడి చేసిన వారు ఆమె ప్రైవేట్ భాగాలపై కూడా కొట్టారు. ఐర్లాండ్‌లో భారత సంతతికి చెందిన చిన్నారిపై జరిగిన మొదటి జాత్యహంకార దాడి ఇది.
భారత సంతతికి చెందిన బాధిత బాలిక కుటుంబం గత ఎనిమిదేళ్లుగా ఐర్లాండ్‌లో నివసిస్తున్నారు. ఇటీవల వీరికి ఐరిష్ పౌరసత్వం లభించింది. నర్సుగా పనిచేస్తున్న చిన్నారి తల్లి అక్కడి మీడియాతో జరిగిన ఘటన గురించి వెల్లడించారు. ఈనెల 4న తన కుమార్తె మరికొంతమందితో కలిసి ఇంటి బయట ఆడుకుంటుండగా ఇది జరిగిందన్నారు. 12-14 మధ్య వయసున్న కొంతమంది అబ్బాయిలు ఆమెపై దాడి చేశారని వెల్లడించారు. డర్టీ ఇండియన్, ఇండియాకు తిరిగి వెళ్ళు' అంటూ జాత్యహంకార దూషణలు చేశారని వివరించారు.
ముఖంపై కొట్టడంతో పాటు ఆమె వ్యక్తిగత అవయవాలపై కూడా దాడి చేశారన్నారు. వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చిన ఆమె ఏడుస్తూ ఉండిపోయిందన్నారు. ఈ ఘటనతో తను చాలా భయపడిపోయిందన్నారు. తన 10నెలల కుమారుడికి ఇంట్లో ఆహారం తినిపిస్తుండగా ఇదంతా జరిగిందన్నారు. తమకు ఇక్కడ సురక్షితంగా అనిపించడం లేదని ఆమె వాపోయారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలచి వేసిందని, కుమార్తెపై దాడి జరగకుండా ఆపలేకపోయానని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఫిర్యాదు చేశానని, అయితే వారికి శిక్ష విధించడం కంటే కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరినట్లు ఆమె తెలిపారు.