విషాదం.. హాలోవీన్ తొక్కిస‌లాట‌లో ద‌క్షిణ‌కొరియా సింగ‌ర్ మృతి

Singer Lee Jihan killed in South Korea's deadly Halloween stampede.తొక్కిస‌లాట‌లో ద‌క్షిణ కొరియా గాయ‌కుడు లీజిహాన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Nov 2022 6:11 AM GMT
విషాదం.. హాలోవీన్ తొక్కిస‌లాట‌లో ద‌క్షిణ‌కొరియా సింగ‌ర్ మృతి

ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్ ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన హాలోవీన్ వేడుక‌లు విషాదాన్ని నింపిన సంగ‌తి తెలిసిందే. తొక్కిస‌లాట కార‌ణంగా 154 మంది మ‌ర‌ణించ‌గా వంద‌ మందికి పైగా గాయ‌ప‌డ్డారు. కాగా.. తొక్కిస‌లాట‌లో ద‌క్షిణ కొరియా న‌టుడు, గాయ‌కుడు లీజిహాన్ కూడా మ‌ర‌ణించారు. ఈ వార్త‌ను లీ జిహాన్ పనిని నిర్వహించే ఏజెన్సీ అయిన 935 ఎంటర్‌టైన్‌మెంట్ ధృవీకరించింది. అత‌ని వ‌య‌స్సు కేవ‌లం 24 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే.

"935 ఎంటర్‌టైన్‌మెంట్, 9 అటో ఎంటర్‌టైన్‌మెంట్‌లో విలువైన కుటుంబ సభ్యుడు అయిన నటుడు లీ జిహాన్.. ఆకాశంలో ధృవ తార‌గా మారి మమ్మ‌ల్ని విడిచిపెట్టారు. నటుడి ఆకస్మిక మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

"లీ జిహాన్ అందరికీ మధురమైన, ఆప్యాయతగల స్నేహితుడు. ఎప్పుడూ నవ్వుతూ మమ్మల్ని పలకరించే అనంతమైన ప్రకాశవంతమైన, అమాయక నటుడు జి-హాన్‌ను మనం ఇకపై చూడలేమని మేము నమ్మలేము. అని తెలిపింది.

లీ జిహాన్ కొరియన్ సింగింగ్ కాంపిటీషన్ ప్రొడ్యూస్ 101లో మాజీ కంటెస్టెంట్. అతను టుడే వాజ్ అనదర్ నామ్ హ్యూన్ డేతో తన టెలివిజన్ అరంగేట్రం చేశాడు. నివేదికల ప్రకారం.. నవంబర్ 1న లీ జి హాన్ అంత్యక్రియలు జరగనున్నాయి.

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రభుత్వం "సంఘటనకు గల కారణాన్ని క్షుణ్ణంగా పరిశోధిస్తుంది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటాం." అని పేర్కొన్నారు.

Next Story