ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఏడాదిగా అతలాకుతలం చేసిన కరోనాను కట్టడి చేసేందుకు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు పరిశోధకులు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్ అయినా రెండు డోసులు మత్రమే ఇవ్వాలి. డోసుల మధ్య దాదాపు నెల రోజుల సమయం ఉండాలి. కానీ ఓ వ్యక్తికి ఒకేసారి ఐదు కరోనా టీకాల డోసులు తీసుకున్న ఘటన సింగపూర్‌లో ఇటీవల చోటు చేసుకుంది. సింగపూర్ నేషనల్ ఐ సెంటర్‌లోని సిబ్బంది ఒకరు ఏకంగా ఐదు ఫైజర్ టీకా డోసులు తీసుకున్నట్లు తెలిసింది. జనవరి 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే ప్రోటోకాల్ ప్రకారం.. ఫైజర్ టీకాను డైల్యూట్ చేసి దానిని సామర్థ్యాన్ని ఐదో వంతుకు తగ్గించి ఆ తర్వాత టీకా ఇవ్వాలి. అయితే డైల్యూట్ చేయడం ప్రారంభించిన వర్కర్ ఒకరు మరో పనిమీద వెళ్లడంతో ఆ స్థానంలోకి వచ్చిన మరో వ్యక్తి డైల్యూషన్ పూర్తయిందని పొరపాటున అదే టీకాను సదరు వ్యక్తికి ఇచ్చేశారట. దీంతో అతడు ఒక డోసుకు బదులు ఏకంగా ఐదు డోసులు ఒకేసారి తీసుకున్నట్లయింది.
అయితే సిబ్బంది ఈ పొరపాటును వెంటనే గుర్తించారు. సీనియర్ డాక్టర్లను అప్రమత్తం చేశారు. వారు సదరు వ్యక్తిని పరిశీలించి అతడిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవని నిర్ధారించారు. మరో రెండు రోజుల పాటు అతడిని ఆస్పత్రిలో ఉంచి పరిశీలించారు. ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక అతడిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సింగపూర్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 30న టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందు కోసం ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాను ఎంచుకుంది. తొలి విడతలో వైద్య సిబ్బందికి మాత్రమే టీకా ఇస్తున్నారు. వ్యాక్సిన్ సరఫరాలో ఎటువంటి అవాంతరాలు తలెత్తని పక్షంలో ఈ ఏడాది చివరి నాటికి ప్రజలందరికీ టీకా అందుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.