కాబూల్ ఎయిర్ పోర్టులో తొక్కిస‌లాట‌.. ఏడుగురు మృతి

Seven Afghan nations killed in a stampede at Kabul Airport.అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు హ‌స్త‌గ‌తం చేసుకున్న‌ప్ప‌టి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Aug 2021 1:23 PM IST
కాబూల్ ఎయిర్ పోర్టులో తొక్కిస‌లాట‌.. ఏడుగురు మృతి

అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు హ‌స్త‌గ‌తం చేసుకున్న‌ప్ప‌టి నుంచి అక్క‌డ ప‌రిస్థితులు భ‌యాందోళ‌న‌ను రేపుతున్నాయి. ఏ క్ష‌ణాన ఏం అవుతుందోన‌ని ప్ర‌జ‌లు ప్రాణాల‌ను అర‌చేతుల్లో పెట్టుకున్నారు. తాలిబ‌న్ల నుంచి త‌ప్పించుకుని దేశం విడిచి వెళ్లేందుకు వేలాది మంది అఫ్గాన్ ప్ర‌జ‌లు కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు. వీరిని నియంత్రించేందుకు తాలిబ‌న్లు గాల్లోకి కాల్పులు జ‌రిపారు.

అక్క‌డ ఏదో జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు ప‌రుగులు తీశారు. దీంతో అక్క‌డ తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ తొక్కిస‌లాట‌లో ఏడుగురు పౌరులు మృతి చెందిన‌ట్లు బ్రిట‌న్ ర‌క్ష‌ణ శాఖ వెల్ల‌డించింది. కాబూల్‌లో ప‌రిస్థితి ఇప్ప‌టికీ స‌వాలుగా ఉంది. అయితే సాధ్య‌మైనంత సుర‌క్షితంగా ఉంచ‌డానికి మేము ప్ర‌య‌త్నిస్తున్నాం అని ఒక ప్ర‌క‌ట‌న‌లో బ్రిట‌న్ ర‌క్ష‌ణ శాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే.. అఫ్గాన్ నుంచి భార‌తీయుల త‌ర‌లింపు కొన‌సాగుతోంది. ఆదివారం ఉద‌యం సీ17 విమానంలో మొత్తం 168 ప్ర‌యాణికుల‌ను కాబూల్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది. అందులో 107 మంది భార‌తీయులు ఉన్నారు. వీరితో పాటు ఇద్ద‌రు అప్ఘాన్ సెనేట‌ర్లు, 24 మంది అఫ్గాన్ సిక్కుల‌ను కూడా భార‌త్‌కు త‌ర‌లించారు. ఆఫ్ఘ‌న్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను త‌ర‌లించ‌డానికి ప్ర‌తి రోజూ రెండు విమానాల‌ను న‌డిపేందుకు ఇండియాకు అనుమ‌తి ల‌భించింది. ఆదివారం ఇండియాలో ల్యాండైన వాళ్ల‌లో చాలా రోజుల నుంచి కాబూల్‌లోని గురుద్వారాలో త‌ల‌దాచుకుంటున్న వాళ్లు ఉన్నారు. వీళ్ల‌ను ఇప్పుడు ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాకు త‌ర‌లించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడిన సెనేట‌ర్ న‌రేంద‌ర్ సింగ్ ఖాస్లా.. కంట‌త‌డి పెట్టారు. ఆఫ్ఘ‌న్‌లో ప‌రిస్థితి ఎలా ఉంద‌ని ప్ర‌శ్నించ‌గా.. ఎంపీ భావోద్వేగానికి గుర‌య్యారు. ఏడుపొస్తోంది. గ‌త 20 ఏళ్ల‌లో నిర్మించింది మొత్తం ఇప్పుడు నాశ‌న‌మైపోయింది. అంతా శూన్యం అని న‌రేంద‌ర్ సింగ్ అన్నారు.

Next Story