శాంసంగ్ కంపెనీకి ఎదురుదెబ్బ‌.. వైస్ చైర్మ‌న్‌కు రెండున్న‌రేళ్ల జైలు‌

Samsung Chief Jailed For 2.5 Years Over Corruption Scandal.శాంసంగ్ కంపెనీకి ఎదురుదెబ్బ‌.. వైస్ చైర్మ‌న్‌కు రెండున్న‌రేళ్ల జైలు‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2021 9:00 AM GMT
Samsung Chief Jailed For 2.5 Years

సియోల్ హైకోర్టులో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక సంఖ్య‌లో స్మార్ట్‌ఫోన్లు అమ్మే సంస్థ‌గా శాంసంగ్‌కు గుర్తింపు ఉన్న‌ది. ఈ టెక్ కంపెనీ ఎల‌క్ట్రానిక్ చిప్స్ కూడా త‌యారు చేస్తుంది. ఆ కంపెనీ వైస్ చైర్మ‌న్ లీ జే యాంగ్‌కు రెండున్న‌రేళ్ల జైలుశిక్ష ఖ‌రారైంది. భారీ అవినీతి కేసులో ఆయ‌న‌కు ఈ శిక్ష విధించారు.మూడేళ్ల క్రితం అవినీతి ఆరోప‌ణ‌లు, ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధిపొందేందుకు నాటి ద‌క్షిణ కొరియా అధ్య‌క్షురాలు పార్క్ గుయిన్-హెయికు లంచం ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌ల‌పై 2017లో లీ జే-యాంగ్ అరెస్టు అయ్యారు.

కేసును విచారించిన కోర్టు ఆయ‌న‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే.. త‌న‌కు విధించిన శిక్ష‌పై లీ జే-యాంగ్ అప్పీలేట్ కోర్టును ఆశ్ర‌యించ‌గా న్యాయ‌స్థానం 2018లో అత‌డి శిక్ష‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే.. లీ జే యాంగ్ శిక్ష‌ను ని‌లిపివేయ‌డాన్ని స‌మీక్షించాల‌ని 2019లో ఆ దేశ సుప్రీం కోర్టు సియోల్ హైకోర్టును ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేర‌కు విచార‌ణ జరిపిన హైకోర్టు అత‌డికి రెండున్న‌రేళ్ల శిక్ష విధిస్తూ సోమ‌వారం తీర్పు వెలువ‌రించింది. ప్ర‌పంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన తీరు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని కోర్టు పేర్కొన్న‌ది. అయితే దీనిపై ఏడు రోజులలోగా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు.

దీంతో శాంసంగ్‌ షేర్లు 4 శాతం వరకు పడిపోయాయి. అలాగే శాంసంగ్‌ సీ అండ్‌ టీ, శాంసంగ్‌ లైఫ్ ఇన్సూరెన్స్, శాంసంగ్‌ ఎస్‌డీఐ లాంటి వంటి అనుబంధ సంస్థల షేర్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.




Next Story