ఖెర్సన్‌ను ఆక్రమించుకున్న రష్యా.. యూఎన్‌వోలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

Russia-Ukraine war 8th day. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. క్రమ క్రమంగా ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తోంది. వరుసగా 8వ రోజు ఉక్రెయిన్‌పై

By అంజి  Published on  3 March 2022 11:02 AM IST
ఖెర్సన్‌ను ఆక్రమించుకున్న రష్యా.. యూఎన్‌వోలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. క్రమ క్రమంగా ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తోంది. వరుసగా 8వ రోజు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. క్షిపణులో దాడులు చేస్తూ ప్రధాన నగరాలను తన గుప్పెట పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రష్యా దళాలు ఉక్రెయిన్‌ దేశంలోని ఖెర్సన్ నగరాన్ని తమ వశం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ దేశం కూడా ధ్రువీకరించింది. ఉక్రెయిన్‌లోని ప్రధాని రేవు పట్టణం అయినా నల్ల సముద్రం ఒడ్డున ఉన్న ఖెర్సన్‌లో దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివాసముంటున్నారు.

రష్యా తన దాడులతో చెర్నోబిల్‌ ప్లాంటును, అణు ఇంధన కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుంది. రాజధాని కీవ్‌కు మరింత చేరువైన రష్యా బలగాలు.. మర్యుపోల్‌ నగరాన్ని చుట్టుముట్టాయి. ప్రజల నివాసాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులపై రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. కీవ్‌, ఖార్కివ్‌ నగరాల్లో క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు 498 మంది సైనికులు చనిపోయారని రష్యా ప్రకటించింది. యుద్ధం ప్రారంభం తర్వాత సైనికులు చనిపోయినట్లు రష్యా ప్రకటించడం ఇదే తొలిసారి.

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలంటూ యునైటెడ్‌ నేషన్స్‌ తీర్మానం చేసింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని యూఎన్‌జీఏ ఆమోదించింది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ సహా 141 సభ్య దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటువేశాయి. అయితే ఉక్రెయిన్ విషయంలో యూఎన్‌వోలో జరిగిన ఓటింగ్‌కు భారత్ మరోసారి దూరంగా ఉన్నది. అయితే మెజార్టీ దేశాలు అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం ఆమోదం పొందినట్లు యూఎన్‌వో జనరల్‌ అసెంబ్లీ ప్రకటించింది.

Next Story