తొలిసారిగా జంతువులకు కరోనా వ్యాక్సిన్
Russia Rolls Out Covid-19 Vaccine for Animals. రష్యా తాజాగా జంతువులకు కరోనా వ్యాక్సినేషన్‌ను డ్రైవ్ ప్రారంభించింది.
By జ్యోత్స్న Published on 28 May 2021 10:58 AM GMTమూగజీవాలు కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించిన రష్యా తాజాగా జంతువులకు కరోనా వ్యాక్సినేషన్‌ను డ్రైవ్ ప్రారంభించింది. కార్నివాక్ కోవ్ పేరిట అభివృద్ది చేసిన టీకాతో ఆరు నెలల వరకు రక్షణ ఉంటుందని వెల్లడించింది. కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కరోనా వైరస్ సోకుతున్నట్లు కొన్ని దేశాల్లో ఇప్పటికే గుర్తించారు. అయితే మానవుల్లో మాత్రమే కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయగా,
ప్రపంచంలో తొలిసారిగా జంతువులకూ కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చింది రష్యా. కుక్కలు, పిల్లులు, నక్కలతో పాటు ఇతర మూగజీవాలపై గతేడాది నుంచే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టిన ఆ దేశం.. వాటిలో యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించామంది. ఇప్పటికే వాటిపై పరిశోధనలు పూర్తి చేసి వ్యాక్సిన్‌ను రిజిస్టస్ సైతం చేసుకున్నట్లు తెలిపింది. ప్రజలు చాలావరకు తమ పెంపుడు జంతువులకు టీకాలను అందించేందుకు మొగ్గుచూపుతున్నారని, టీకాల కోసం క్లినిక్‌లను సంప్రదిస్తున్నారని రష్యా వెటర్నరీ విభాగం తెలిపింది. అనుబంధ సంస్థ నుంచి 17 వేల డోసులతో తొలి విడత పంపిణీ ప్రారంభమైంది. అయితే ఈ వ్యాక్సిన్‌కు భారీగా డిమాండ్ ఉంది. దీంతో మొదటి బ్యాచ్ టీకాలను దేశంలోనే పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఉత్పత్తి సామర్థ్యం నెలకు 30 లక్షల డోసులుగా ఉందని, దాన్ని 50 లక్షలకు పెంచుతామని వివరించారు.
జర్మనీ, దక్షిణ కొరియా, ఆస్ట్రియా, గ్రీస్, పోలాండ్, కెనడా, మలేసియా, థాయిల్యాండ్, అమెరికాతో పాటు సింగపూర్‌కు చెందిన పలు సంస్థలు ఈ వ్యాక్సిన్‌ను కొనేందుకు ముందుకు వచ్చాయని, అయితే తమ దేశంలో కొంత వాక్సినేషన్ జరిగిన తర్వాత ఇతర దేశాల గురించి ఆలోచిస్తామని ఆ సంస్థ పేర్కొంది.
నిజానికి కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది అనటానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కుక్కలు, పిల్లులు, కోతులు, సింహాలు వంటి కొన్ని జీవులలో కొత్త వ్యాదులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జంతువులకు వేసే కరోనా టీకా ప్రత్యేకతను సంతరించుకుంది.