కాల్పుల విరమణపై ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. కానీ...
రెండేళ్ల నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla
కాల్పుల విరమణపై ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. కానీ...
రెండేళ్ల నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు ఎవరూ ఇన్నాళ్లు ముందుకు రాలేదు. ఎవరి పై చేయి సాధిస్తామో చూసుకుందాం అంటూ యుద్ధంలో పోరాడుతున్నారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన కామెంట్స్ చేశారు. కాల్పల విరమణకు ఆదేశిస్తానని ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు. అయితే..ఆయన ఊరికినే కాల్పుల విరమణ చేస్తామనలేదు.. ఇందులో రెండు షరతులను కూడా విధించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలు, కాల్పుల విరమణపై ఆసక్తికరకామెంట్స్ చేశారు. రష్యా విదేశాంగశాఖ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. తాము వెంటనే కాల్పుల విరమణ చేస్తామని ప్రకటించారు. అయితే.. కాల్పుల విరమణకు ఆదేశాలతో పాటు చర్చలు కూడా ప్రారంభిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. కానీ.. తమ స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని కీవ్‌కు షరతు విధించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. తుది పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఒకవైపు జీ7 దేశాలు ఇటలీలో సమావేశమైన తరుణంలో ఈ ప్రకటన రావడం పట్ల ప్రాధాన్యత సంతరించుకుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ప్రాంతాలు దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియాలు తమ దేశంలో విలీనం అయ్యాయని గతంలో చెప్పారు. ఈ చర్యలను ఉక్రెయిన్ ఖండించింది. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు మద్దతు తెలిపాయి. ప్రస్తుతం నాటోలో చేరే దిశగా అడుగులు వేస్తోన్న తరుణంలో... రష్యా ఇచ్చిన ఆఫర్ ఉక్రెయిన్‌కు నచ్చకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆఫర్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి.