చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందే కూలిన రష్యా ల్యాండర్
చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా 25 ప్రయోగం ఫెయిల్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 4:14 PM ISTచంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందే కూలిన రష్యా ల్యాండర్
చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా 25 ప్రయోగం ఫెయిల్ అయ్యింది. చంద్రుడిపై అడుగు పెట్టడానికి ముందే ల్యాండర్ కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా అంతరిక్ష సంస్థ 'రోస్‌కాస్మోస్' వెల్లడించింది. ప్రయోగం చివరి క్షణంలో విఫలమైందని.. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ కుప్పకూలిపోయిందని అధికారులు వెల్లడించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి చేరాలనుకున్న రష్యా కల చెదిరిపోయినట్లు అయ్యింది. చంద్రుడి దగ్గరకు వెళ్లిన ల్యాండర్.. అనియంత్రిత కక్ష్యలో పరిభ్రమించింది. అనంతరం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ తెలిపింది.
దాదాపు 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపై పరిశోధనల కోసం లూనా–25ను రష్యా చేపట్టింది. చంద్రయాన్–3ని ఇస్రో ప్రయోగించిన కొన్ని రోజుల తర్వాత లూనా–25ను రష్యా ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్–3 కంటే ముందే దిగేలా ఈ ప్రాజెక్టు చేపట్టింది.ఈ క్రమంలో ల్యాండర్ 21 తేదీన దక్షిణ దృవంపై దిగేందుకు సిద్ధం అయ్యింది. ల్యాండింగ్‌కు ముందు కక్ష్యకు చేరడానికి లూనా-25 శనివారం కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలోనే వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో.. వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయినట్లు రోస్‌కాస్మోస్ ప్రకటించింది. ఆ తర్వాత చంద్రుడిపై ల్యాండర్ కుప్పకూలిందని ప్రకటించారు.
రష్యా ల్యాండర్ దాదాపు 10 రోజుల ప్రయాణించింది. చంద్రుడి ఫొటోలను కూడా పంపించింది. కొద్దిగంటల్లో చంద్రుడిపై దిగుతుందనగా.. క్రాష్ అయ్యింది. ఇక భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3.. ఆగస్టు 23న సాయంత్రం చద్రుడి దక్షిణ ద్రువానికి చేరువలోని ప్రదేశంలో దిగనున్నట్లు తెలుస్తోంది.