విమానాశ్రయంపై రాకెట్ల దాడి.. దెబ్బతిన్న రన్‌వే
Rockets Fired At Kandahar Airport In Afghanistan.ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సైన్యాలు వెనుదిరిగినప్పటి నుంచి
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2021 5:27 AM GMTఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సైన్యాలు వెనుదిరిగినప్పటి నుంచి తాడిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశంపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రభుత్వ మద్దతు దారులను, ప్రజలను దారుణంగా హింసించి చంపుతున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం రాత్రి కాందహార్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్లతో దాడి చేశారు. మూడు రాకెట్లతో దాడి చేయగా.. రెండు రాకెట్లు రన్‌వేను ఢీకొన్నాయి. రన్‌వే దెబ్బతినడంతో పలు ప్రాంతాలకు వెళ్లవలసిన విమానాలను రద్దు చేశారు. ఆదివారం సాయంత్రానికి విమాన సేవలు పునరుద్దరించే అవకాశం ఉంది.
నిన్న రాత్రి ఎయిర్‌పోర్టులో మూడు రాకెట్లు ప్రయోగించబడ్డాయి. వాటిలో రెండు రన్‌వేను ఢీకొన్నాయి. ఈ కారణంగా విమానాశ్రయం నుండి అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి అని ఎయిర్‌పోర్ట్ చీఫ్ మసౌద్ పష్తున్ తెలిపారు. రన్‌వే మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఆదివారం సాయంత్రం విమానాశ్రయం పనిచేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
గత కొద్ది రోజులుగా ఆఫ్గనిస్తాన్ సైన్యానికి, తాలిబన్లకు మధ్య భీకర యుద్దం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది తాలిబన్లు నగరంలోకి ప్రవేశించారు. తాలిబన్లపై దాడికి కాందహార్ విమానాశ్రయం కీలకంగా వ్యవహరిస్తోంది. సైన్యానికి కావాల్సిన లాజిస్టిక్, వాయుసేన సహకారం ఇక్కడి నుంచే అందుతోంది. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఉంటారని అధికారులు బావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలైన పశ్చిమాన ఉన్న హెరాత్, దక్షిణాన ఉన్న లష్కర్ గాహ్ అనే రెండు ప్రాంతాలను తాలిబన్లు స్వాదీనం చేసుకున్నారు.