రిహన్నా.. ఈ సారి హిందువుల మనోభావాలను దెబ్బతీసింది
Rihanna creates controversy again.రిహన్నా మరోసారి ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో కారణంగా వివాదం మొదలైంది.
By Medi Samrat Published on 17 Feb 2021 4:52 PM ISTనూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపింది అమెరికన్ పాప్‌స్టార్ రిహన్నా. భారతదేశ సమస్యలపై తలదూర్చకు అంటూ పలువురు రిహన్నాను విమర్శించడం మొదలుపెట్టారు. తాజాగా మరోసారి ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో కారణంగా వివాదం మొదలైంది. రిహన్నా పోస్టు చేసిన ఓ టాప్‌లెస్ ఫొటో దుమారం రేపుతోంది. ఆ ఫొటోలో టాప్‌లెస్‌గా కనిపించిన రిహన్నా ఓ నెక్లెస్ ను ధరించింది. ఆ నెక్లెస్‌కు వజ్రాలు పొదిగిన వినాయక ప్రతిమ ఉంది. టాప్‌లెస్‌గా ఉంటూ హిందూ దైవమైన విఘ్నేశ్వరుడి ప్రతిమను మెడలో వేసుకోవడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలను ఆమె దారుణంగా గాయపరిచిందని.. కావాలనే ఇలా చేస్తోందంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. కళా సౌందర్యం పేరుతో హిందూ మతాన్ని, సంస్కృతిని వాడుకోవడం మానాలని రిహన్నాకు పలువురు హితవు పలికారు. రిహన్నా వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రిహన్నా టాప్‌లెస్ ఫోటోషూట్‌పై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనవాలా స్పందించారు. మా సెంటిమెంట్లను హర్ట్ చేశావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ''నేను ముస్లింని. అయినప్పటికి ఓ భారతీయుడిగా.. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా నేను వినాయకుడిని ఎంతో ప్రేమిస్తాను. అలాంటి గణేష్ పెండెంట్‌ని నీవు ఇలాంటి అసభ్య ఫోటో కోసం వాడటం సరైంది కాదు. నీ చర్యలు నా మనోభావాలను, సెంటిమెంట్లను గాయపరిచింది. భారతదేశంలో రిహన్నాకు మద్దతిచ్చేవారు దీన్ని అంగీకరిస్తారా?'' అంటూ ట్వీట్ చేశారు.
రిహన్నా భారత్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు తెలుపుతున్న రైతులకు మద్దతుగా కొద్దిరోజుల కిందట ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. "మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోకూడదు?" అంటూ ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్‌ను, ఓ మీడియాలో ప్రచురితమైన వార్తను జోడిస్తూ పోస్ట్ పెట్టారు.