ప్రధాని మోదీకి ప్రెసిడెంట్ జో బిడెన్ ఫోన్ కాల్

Readout of President Biden’s Call with Prime Minister Modi of India.అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రధాని నరేంద్ర మోదీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Feb 2023 3:00 PM GMT
ప్రధాని మోదీకి ప్రెసిడెంట్ జో బిడెన్ ఫోన్ కాల్

అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో బోయింగ్ డీల్ గురించి ఫోన్ లో మాట్లాడారని వైట్ హౌస్ ప్రకటన తెలిపింది. 200 పైగా అమెరికన్ మేడ్ విమానాలను కొనుగోలు చేయడానికి ఎయిర్ ఇండియా ముందుకు రావడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా జో బిడెన్ అభివర్ణించారు. అమెరికాలో ఒక మిలియన్ అమెరికన్ ఉద్యోగాలకు మద్దతు ఇస్తుందని, భారతదేశంలో విమాన రవాణా కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చడంలో ఎయిర్ ఇండియాకు సహాయపడుతుందని అన్నారు.

ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యం బలాన్ని ప్రతిబింబిస్తుందని జో బైడెన్ తెలిపారు. దీనితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి భారత్ - అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. భారత్-అమెరికా మధ్య స్ట్రాటజిక్ టెక్నాలజీ భాగస్వామ్యం ప్రాధాన్యం గురించి కూడా వీరిరువురూ చర్చించినట్లు తెలిపింది. రెండు వారాల క్రితం వాషింగ్టన్‌లో ప్రారంభించిన క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఇనీషియేటివ్ గురించి కూడా వీరు మాట్లాడినట్లు పేర్కొంది. ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి, పరస్పర ప్రాధాన్యతాంశాల్లో సహకరించుకునేందుకు కలిసికట్టుగా, QUAD వంటి ఇతర గ్రూపులతో కలిసి పని చేయడాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ఎయిర్ ఇండియా బోయింగ్ నుండి 34 బిలియన్ అమెరికన్ డాలర్లకు 220 విమానాలను కొనుగోలు చేయనుంది. మొత్తం మీద ఇది టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్, బోయింగ్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం. ఇరు దేశాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతుండటంపై ప్రధాని మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Next Story