ర్యాపర్ టు ప్రధాని..నేపాల్‌లో ముగిసిన పాత తరం పాలన..బాలేన్‌ షా రికార్డు

నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది.

By -  Knakam Karthik
Published on : 27 March 2026 11:30 AM IST

International News, BalenShah, Nepal PM, Youngest Prime Minister, Nepal Politics, NepalElectionResults

ర్యాపర్ టు ప్రధాని..నేపాల్‌లో ముగిసిన పాత తరం పాలన..బాలేన్‌ షా రికార్డు

నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించి, యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న 35 ఏళ్ల బాలేంద్ర షా (బాలెన్) శుక్రవారం నేపాల్ దేశపు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) పార్లమెంటరీ నాయకుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాలెన్ నేతృత్వంలోని ఆర్‌ఎస్‌పి ప్రభంజనం సృష్టించింది. ప్రతినిధుల సభలోని 275 స్థానాలకు గాను ఏకంగా 182 స్థానాలను కైవసం చేసుకుని, దశాబ్దాలుగా ఏలుతున్న సంప్రదాయ రాజకీయ పార్టీలను మట్టికరిపించింది.

ముఖ్యంగా నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన సీనియర్ నేత కేపీ శర్మ ఓలీని ఆయన కంచుకోట అయిన ఝపా-5 నియోజకవర్గంలోనే బాలెన్ భారీ మెజారిటీతో ఓడించడం విశేషం. అవినీతి రహిత పాలన మరియు తరాల మార్పును కోరుతూ గత ఏడాది 'జెన్ జెడ్' (Gen Z) జరిపిన నిరసనల ప్రభావం ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.

ఈ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ 38 సీట్లకు, సిపిఎన్-యుఎంఎల్ 25 సీట్లకు పరిమితమయ్యాయి. శీతల్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలేంద్ర షా, త్వరలోనే 15 నుండి 18 మంది సభ్యులతో కూడిన కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు. ఒక సామాన్య కళాకారుడి స్థాయి నుండి దేశ అత్యున్నత పదవిని అధిష్టించడం నేపాల్ రాజకీయాల్లో పెను మార్పుకు సంకేతంగా నిలుస్తోంది.

Next Story