శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పట్లో శ్రీలంకలో పరిస్థితులు కుదటపడేలా కనిపించడం లేదు. దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించాయి. అయినప్పటికీ మరోసారి దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధిస్తూ అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే ఆదేశాలు జారీ చేశారు. దేశ ప్రజలకు భద్రత కల్పించటం, ప్రజా రవాణా, నిత్యావసరాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుని ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 1959లోని 8వ చట్ట సవరణ, ప్రజా భద్రత ఆర్డినెన్స్(చాప్టర్ 40)లోని సెక్షన్ ప్రకారం తనకు అందిన అధికారల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రణిల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా జులై 18 నుంచి అత్యవసర పరిస్థితి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ప్రజానిరసనల నడుమ శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది మూడోసారి. కాగా గోటబాయ రాజపక్సే రాజీనామాను శుక్రవారం పార్లమెంటు ఆమోదించింది.
వేల మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు వారం క్రితం కొలంబో వీధుల్లోకి వచ్చి గొటబాయ అధికారిక నివాసం, కార్యాలయాలను ఆక్రమించిన తర్వాత అతను మాల్దీవులకు అక్కడి నుంచి సింగపూర్‌కు వెళ్లాడు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించడానికి శ్రీలంక పార్లమెంటు శనివారం సమావేశమైంది.