శ్రీలంక అట్టుడుకుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకలో ప్రజాగ్రహం పెల్లిబికింది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో చెలరేగిన హింసాకాండ కొనసాగుతోంది. ప్రజాగ్రహం తీవ్రతరం కావడంతో సోమవారం.. మహీంద రాజపక్స తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన కొన్ని గంటలకే హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న రాజపక్స మ్యూజియాన్ని ధ్వంసం చేశారు. మ్యూజియంలో ఉన్న రాజపక్స కుటుంబీకుల మైనపు విగ్రహాలను విరగొట్టారు.
పలువురు మంత్రుల నివాసాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బస్సులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. సోమవారం జరిగిన ఆందోళనల్లో ఎంపీ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 190 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మంగళవారం ఉదయం గొటబాయ నివాసాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అధ్యక్షుడు నివాసానికి అత్యంత సమీపంగా దూసుకువచ్చారు. సైన్యం వారిని అడ్డుకుంది. ప్రస్తుతం గొటబాయ నివాసం వద్ద భారీగా సైన్యం మోహరించి ఉంది.
క్రమ క్రమంగా ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరడంతో శ్రీలంక వ్యాప్తంగా నిన్న కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు అదుపులోకి వచ్చేందుకు బుధవారం వరకూ కర్ఫ్యూ ని పొడిగించారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని ఆర్మీ చీఫ్ జనరల్ శావేంద్ర సిల్వా కోరారు.