రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. క్రెమ్లిన్‌లో ఉన్న రష్యా సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సంక్రమించడంతో పుతిన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కేవలం వీడియో ద్వారా ఆయన సమావేశాలకు హాజరకానున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన మీటింగ్‌లన్నీ ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. జర్నలిస్టుల కోసం ఇవాళ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. పుతిన్ ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నట్లు ఆ ప్రకటనలో చెప్పారు. తజక్ నేత ఎమ్మోమలి రెహమాన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో పుతిన్ మాట్లాడారు.
తాను ఉంటున్న ప్రదేశంలో కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని, కొన్ని రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు పుతిన్ ఆ ప్రకటనలో తెలిపారు. మంగళవారమే సిరియా అధ్యక్షుడు అసద్ భాషర్‌ను పుతిన్ కలిశారు. క్రెమ్లిన్‌లో ఆ సమావేశం జరిగింది. అధ్యక్ష భవనంలో చాలా మందికి కరోనా సోకడం వల్ల కూడా పుతిన్ సెల్ఫ్ ఐసోలేట్ కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లోనే స్వదేశీ స్పుత్నిక్ టీకాను పుతిన్ వేసుకున్నారు. పుతిన్ మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన అనుచరులు తెలిపారు.