జీ20 సమ్మిట్‌కు ఎందుకు రాలేదో చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్

జీ20 సమ్మిట్‌కు ఎందుకు రాలేదో తాజాగా క్లారిటీ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

By Srikanth Gundamalla  Published on  6 Oct 2023 6:47 AM GMT
putin, india,  russia, G20,

జీ20 సమ్మిట్‌కు ఎందుకు రాలేదో చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్

భారత్‌ అధ్యక్షతన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు.. దక్షిణాఫ్రికాలో బ్రిక్స్‌ సదస్సు కూడా జరిగింది. అయితే.. ఈ రెండు సదస్సులకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హాజరుకాలేదు. ఈ క్రమంలో ఆయన ఈ రెండు సమావేశాలకు హాజరుకాకపోవడంపై స్పందించారు. ఎందుకు రాలేదనేదానిపై క్లారిటీ ఇచ్చారు. తన వల్ల ఈ రెండు సదస్సులు పోలిటికల్‌ షోగా మారొద్దనే రాలేదని చెప్పుకొచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

ఈ సందర్భంగా భారత్‌తో సంబంధాలపైనా మాట్లాడారు పుతిన్. భారత్‌, రష్యా మధ్య విభేదాలు సృష్టించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. అయితే.. ఢిల్లీ ప్రభుత్వం తమ పౌరుల ప్రయోజనాల కోసం స్వతంత్రంగా పనిచేస్తోందని.. అందువల్ల పశ్చిమ దేశాల కుతంత్రాలు ఆ దేశంపై పని చేయవని వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యాలోని సోచి నగరంలో రష్యన్‌ బ్లాక్‌ సీ రిసార్ట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌.. ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు తమ గుత్తాధిపత్యాన్ని అంగీకరించని ప్రతి దేశాన్ని శత్రువుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. భారత్‌ సహా అన్ని దేశాలు ప్రమాదంలోనే ఉన్నాయని చెప్పారు. అయితే.. భార త ప్రభుత్వం తమ దేశ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. భారత్‌ స్వతంత్ర దేశమని.. అందువల్ల రష్యా నుంచి ఢిల్లీని దూరం చేసే ప్రయత్నాలు అర్థం లేని చర్యలే అని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక బలగాలు విరుచుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్కో నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా, ఐరోపా సమాఖ్య వంటి పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. భారత్‌ మాత్రం రష్యా నుంచి చౌక ధరకు చమురు దిగుమతి చేసుకుంటోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ నిర్ణయాన్ని పలు దేశాలు అయితే తప్పుబడుతూ ఆరోపణలు చేశాయి. ఈ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించి పశ్చిమ దేశాల తీరుని తప్పుబట్టారు.

Next Story