జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రూరమైన దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల పుతిన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు రష్యా పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ హేయమైన దాడికి పాల్పడిన వారితో పాటు, దాని వెనుక ఉన్న సూత్రధారులు, వారికి మద్దతునిచ్చిన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి, శిక్షించాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
"రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అమాయకుల మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ఘోరమైన దాడికి పాల్పడిన వారిని, వారికి మద్దతిచ్చిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఆయన అన్నారు" అని జైస్వాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే నిబద్ధతను పునరుద్ఘాటించారు. రష్యా ‘విజయోత్సవ దినోత్సవం’ 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా పుతిన్‌ను మోదీ ఆహ్వానించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.