పబ్ జీ.. ఈ గేమ్ కు భారత్ లో భారీగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్ ను బ్యాన్ చేసింది. చైనాతో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చాలా యాప్స్ ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో పబ్ జీ గేమ్ కూడా భారత్ లోని అభిమానులకు దూరమయ్యింది. దీంతో ఎంతో మంది గేమర్స్ హర్ట్ అయ్యారు. ఇక పబ్ జీ కి ధీటుగా వచ్చిన గేమ్స్ ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఫౌజీ అంటూ మేడిన్ ఇండియా గేమ్ యాప్ వచ్చినప్పటికీ.. దాని వైపు భారత్ లోని గేమర్స్ కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక ఎలాగైనా భారత్ లోకి పబ్ జీ రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తూ ఉంది. గతంలో కూడా ప్రయత్నించి భంగపడింది.
ఇప్పుడు తిరిగి భారత్ లో పబ్ జీ ఎంటర్ అవ్వాలని అనుకుంటూ ఉంది. పబ్‌జీ మాతృ సంస్థ పబ్‌జీ పేరును 'బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' గా మారుస్తు కొత్త పోస్టర‍్లను విడుదల చేయడంతో మరోసారి పబ్ జీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇక పబ్‌జీ సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టర్లను షేర్ చేయడంతో పబ్‌జీ గేమ్ త్వరలో ఇండియాలో విడుదల కాబోతుందనే పుకార్లు షికార్లు మొదలయ్యాయి. గత కొంత కాలంగా భారతదేశంలో తన గేమ్‌ను తిరిగే ప్రారంభించేందుకు ఉద్యోగుల నియామకాన్ని వేగం చేసింది. అయితే పబ్ జీ రీఎంట్రీకి భారత్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేక మరోసారి కూడా పబ్ జీ సంస్థ ఆశలు గల్లంతవుతాయో చూడాలి.