పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కూరుకుపోయింది. ఇప్పట్లో ఆ సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ క్రమంలో మరోమారు లంక రణరంగంగా మారింది. అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకారులు లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసాన్ని చుట్టు ముట్టారు. అధ్యక్షుడి నివాసంలోకి దూసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రాజపక్స ఇంటి నుంచి పారిపోయినట్లు శ్రీలంక రక్షణ శాఖ వెల్లడించింది. అధ్యక్షుడి నివాసం వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రీలంక సైన్యం టియర్ గ్యాస్‌ను ప్రయోగించింది. అయినప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీఛారికి చేశారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో దేశ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని కూడా అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతుంది. దీంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆందోళన బాట పట్టారు. ప్రజాందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.