బ్రిటన్ రాజ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) కన్నుమూశారు. ఈ మేరకు బకింగ్ హ్యామ్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. విండ్సర్ కాజిల్ లో శుక్రవారం ఫిలిప్ తుదిశ్వాస విడిచారని ప్రకటనలో పేర్కొంది. 1921, జూన్ 10న కార్ఫు ద్వీపంలో జన్మించిన ప్రిన్స్ ఫిలిప్.. 1947లో యువరాణి ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. ప్రిన్స్ ఫిలిప్, రాణి ఎలిజబెత్ దంపతులకు నలుగురు సంతానం కాగా.. ఎనిమిది మంది మనవరాళ్ళు, 10 మంది మునిమనవళ్లు ఉన్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ఆయనకు కింగ్ ఎడ్వర్డ్-7 హాస్పిటల్, సెయింట్ బరతోలోమెవ్ హాస్పిటల్‌లో చికిత్స జరిగింది. ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్-2 వివాహ 73వ వార్షికోత్సవం గత ఏడాది నవంబరులో జరిగింది. వీరిద్దరూ కోవిడ్-19 మహమ్మారి కారణంగా విండ్సర్ కేజిల్‌లో ఏకాంతంగా గడిపేవారు. ఈ ఏడాది జనవరిలో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రిన్స్ మృతికి సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలను అవనతం చేస్తారు. 100వ జన్మదినం మరో రెండు నెలల్లో జరుగనుండగా.. ప్రిన్స్ తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.