మరో కష్టం.. నిలిచిన విద్యుత్ సరఫరా
Power outage plunges Pakistan into darkness.ఓ పక్క ధరలు మండిపోతుంటే మరో కష్టం వచ్చి పడింది
By తోట వంశీ కుమార్ Published on 24 Jan 2023 10:54 AM ISTమూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు అన్న చందంగా తయారైంది పాకిస్థాన్ పరిస్థితి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో ఆ దేశంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఓ పక్క ధరలు మండిపోతుంటే మరో కష్టం వచ్చి పడింది అక్కడి ప్రజలకు. నేషనల్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి రాజధాని ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ వంటి ప్రధాన పట్టణాలతో సహా చాలా నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుడ్డు నుంచి క్వెట్టాకు రెండు ట్రాన్స్మిషన్ లైన్లు ట్రిప్ అయ్యాయని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ తెలిపింది. కరెంట్ సరఫరా లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు దీపాల వెలుగులోనే నడిచాయి. చాలా ప్రాంతాలు అందకారంలోనే ఉన్నాయి.
అయితే.. ఇదేమీ అంత పెద్ద సంక్షోభం కాదని, పునరుద్ధరణ చర్యలను వెంటనే ప్రారంభించామని, కొన్ని గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని విద్యుత్తు శాఖ మంత్రి ఖుర్రమ్ దస్త్‌గిర్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. పాక్‌లో కరెంటు కోతలు సర్వ సాధారణమైపోయాయి. ఆస్పత్రులు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ సంస్థలు జనరేటర్ల సాయంతోనే నడుస్తున్నాయంటే అక్కడ ఏ విధమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెలలోనే పాక్ కొత్త ఇంధన పరిరక్షణ ప్రణాళికను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.