ఢాకా: బంగ్లాదేశ్‌లో నేడు అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత దేశంలో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. సుదీర్ఘ రాజకీయ అనిశ్చితి, విద్యార్థి ఉద్యమాల తర్వాత బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేస్తోంది. గురువారం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4:30 వరకు కొనసాగనుంది.
300 పార్లమెంటరీ స్థానాలు (ఒక అభ్యర్థి మరణంతో 299 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది). సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), షఫీకర్ రెహమాన్ నేతృత్వంలోని జమాత్-ఏ-ఇస్లామీ కూటమి, విద్యార్థి నేతలు ఏర్పాటు చేసిన నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) పోటీలో ఉన్నాయి. గత 15 ఏళ్లు పాలించిన షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఉండటంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం లేదు. ఓపినియన్ పోల్స్ ప్రకారం తారిఖ్ రెహమాన్ (BNP) ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.