ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముగించుకుని ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ప్రధాని విమానం మోర్స్బీ (జాక్సన్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అక్కడ ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పాపువా న్యూ గినియా ప్రధాన మంత్రి జేమ్స్ మార్పే.. ప్రధాని మోదీ పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి ప్రతిగా ప్రధాని మోదీ ఆయనను కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. FIPIC సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పపువా న్యూ గినియా చేరుకున్నారు.
పాపువా న్యూ గినియాలో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. ఏ భారత ప్రధానికైనా ఇదే తొలిసారి కావడం విశేషం. అందుకే ఈ టూర్ చాలా ప్రత్యేకం. సాధారణంగా.. పపువా న్యూ గినియాలో సాయంత్రం తర్వాత దేశాధినేతలకు సంప్రదాయ స్వాగతం లభించదు. కానీ ప్రధాని మోదీ విషయంలో పపువా న్యూ గినియా తన సంప్రదాయాన్ని మార్చుకుంది.
పపువా న్యూ గినియాకు చేరుకున్న ప్రధాని మోదీకి పూర్తి ప్రభుత్వ గౌరవాలతో సంప్రదాయ స్వాగతం లభించింది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు పపువా న్యూ గినియా ప్రధాని స్వయంగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీకి గార్డు ఆఫ్ హానర్ కూడా ఇచ్చారు. అక్కడ నివసించే భారతీయులు కూడా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు 'హర్‌హర్ మోదీ', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు.