మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్యూ మై ఫ్రెండ్..మోదీకి ట్రంప్ బర్త్‌డే విషెస్
ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు
By - Knakam Karthik |
ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. రష్యా చమురు దిగుమతులపై భారత్‌పై నెలల తరబడి విమర్శలు చేసిన ట్రంప్, మంగళవారం ఫోన్‌లో మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోసం భారత్ ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేస్తూ – “నా మిత్రుడు ప్రధాని మోదీకి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాను. ఆయన అద్భుతమైన పని చేస్తున్నారు. యుద్ధం ముగించేందుకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని అన్నారు. మోదీ సమాధానంగా X (Twitter) లో – “ధన్యవాదాలు నా మిత్రుడు ట్రంప్. భారత్–అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తాం. ఉక్రెయిన్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం మేము కూడా కట్టుబడి ఉన్నాం” అని రాశారు.
ఇదే సమయంలో భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఢిల్లీలో మళ్లీ ప్రారంభమయ్యాయి. అమెరికా USTR చీఫ్ నెగోషియేటర్ బ్రెండన్ లించ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ బృందంతో సమావేశమైంది. ఏడు గంటల పాటు జరిగిన చర్చలను రెండు పక్షాలు “సానుకూలమైనవి, ముందుకు సాగేలా ఉన్నవి”గా అభివర్ణించాయి. త్వరగా “పరస్పర ప్రయోజనకర ఒప్పందం” కోసం కృషి చేయాలని అంగీకరించాయి.
గత నెలలో అమెరికా భారత్ ఎగుమతులపై 50% టారిఫ్‌లు విధించడం, రష్యా చమురు దిగుమతుల కారణంగా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే తాజాగా రెండు దేశాలూ సర్దుబాటు సంకేతాలు ఇస్తూ, సంబంధాలను పునరుద్ధరించేందుకు ముందడుగు వేస్తున్నాయి.