ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాజు, మంత్రి, సామాన్యుడు, ధనికుడు అన్న తేడా లేకుండా అందరికీ ఈ మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు. సెలబ్రెటీలు సైతం ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆయన వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం ఆయన స్వీయ నిర్భంధంలో ఉన్నారు. ఈ మేరకు జాతీయ ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రధానికి ప్రత్యేక సహాయకారిగా ఉన్న పైజల్ సుల్తాన్ ట్వీట్ చేశారు.
కాగా.. రెండు రోజుల క్రితమే ఇమ్రాన్ ఖాన్ చైనా టీకా సినోఫాం మొదటి డోసును తీసుకోవడం గమనార్హం. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు పాటించాలని వ్యాక్సినేషన్ తీసుకున్న సందర్భంగా ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఇక పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 6,15,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 13,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో నమోదయ్యే ఎక్కువ కేసుల్లో పంజాబ్ వాటానే అధికంగా ఉంది. కరోనాను అంతం చేసేందుకు మార్చి 10నుంచి ఆదేశ ప్రజలకు వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు. ఫిబ్రవరి మొదట్లో ఆరోగ్య కార్యకర్తలు, కరోనా వారియర్స్‌కు టీకా వేయగా ఇప్పుడు.. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చారు.