ర‌న్‌వేపై ఫైర్ ట్ర‌క్కును ఢీకొట్టిన‌ విమానం.. చెలరేగిన మంట‌లు.. ఇద్ద‌రు మృతి

Plane Taking Off From Peru Airport Hits Fire Truck Bursts Into Flame.LATAM ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఫైర్‌ట్రక్కును

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2022 5:45 AM GMT
ర‌న్‌వేపై ఫైర్ ట్ర‌క్కును ఢీకొట్టిన‌ విమానం.. చెలరేగిన మంట‌లు.. ఇద్ద‌రు మృతి

పెరూ దేశంలోని ఓ విమానాశ్ర‌యంలో ప్ర‌మాదం చోటు చేసుకుంది. లిమాలోని విమానాశ్ర‌యం నుంచి టేకాఫ్ అవుతున్న LATAM ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం రన్‌వేపై ఫైర్‌ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, అయితే ట్రక్కులో ఉన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారని అధికారులు తెలిపారు. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 100 మందికి పైగా ప్ర‌యాణీకులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

విమానం, అగ్నిమాపక వాహనం ఢీకొన్న ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీడియోల్లో ఒకదానిలో.. ప్రయాణీకుల విమానం రన్‌వేపైకి వెళ్లినప్పుడు ఎదురుగా వస్తున్న ఫైర్ ఇంజన్‌ను ఢీకొట్టడం చూడవచ్చు. మరో వీడియోలో.. విమానంలో మంటలు వ్యాపిస్తూ దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్నాయి.

LATAM పెరూ ప్రకారం.. లిమా నుంచి జూలియాకా వెళ్లేందుకు ఫ్లైట్ LA 2213 ప్ర‌యాణీకుల‌తో సిద్దంగా ఉంది. లిమాలోని జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో రన్‌వేలోకి ప్రవేశించిన అగ్నిమాపక ఇంజిన్‌ను ఢీకొట్టింది. వెంట‌నే విమానాన్ని నిలిపివేశారు. వెంట‌నే రెస్య్కూ బృందాలు అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

ఒక క్లినిక్‌లో 20 మంది ప్రయాణికులకు చికిత్స అందించార‌ని, అందులో కనీసం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ చనిపోలేదని వెల్ల‌డించింది. జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 61 మందిని సమీపంలోని క్లినిక్‌లు మరియు ఆసుపత్రులకు తరలించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

పెరూ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో ఈ ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేశాడు. మ‌ర‌ణించిన ఇద్ద‌రు అగ్నిమాప‌క సిబ్బంది కుటుంబాల‌కు సంతాపం తెలిపారు.

Next Story