ఇళ్ల మధ్య కూలిన విమానం.. 8 మంది మృతి
Plane crashes near Colombia due to engine failure, 8 onboard dead. కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మెడెలిన్ నగరంలోని ఓ చిన్న విమానం ఇంజిన్
By అంజి Published on 22 Nov 2022 1:50 PM IST
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మెడెలిన్ నగరంలోని ఓ చిన్న విమానం ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 8 మంది మృతి చెందారు. ఒలాయా హెర్రెరా విమానాశ్రయం నుంచొ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్ప కూలిపోయిందని కొలంబియా ఏవియేషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మృతులు ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందిగా గుర్తించారు. విమానంలో ఎనిమిది మంది కంటే ఎక్కువ మంది ఉన్నారా అనేది వెంటనే తెలియరాలేదు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా కనుగొనబడలేదు. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాల కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంజిన్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో తెలిపారు. ''దురదృష్టవశాత్తూ పైలట్ విమానాన్ని ఎత్తులో ఉంచలేకపోయాడు. ఇళ్ల పరిసరాల్లో విమానం కూలిపోయింది. ఏడు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆరు ఇతర భవనాలు దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించారు.'' అని వివరించారు.
ఇదిలా ఉంటే.. ప్రెసిషన్ ఎయిర్ ప్యాసింజర్ విమానం బుకోబా విమానాశ్రయానికి వెళుతుండగా విక్టోరియా సరస్సులో కూలిపోయింది. విమానం విమానాశ్రయానికి 100 మీటర్ల దూరంలో కూలిపోయింది. విమానంలో 43 మంది ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. అయితే ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనేది తెలియరాలేదు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 43 మందిలో 39 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు పైలట్లు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.