ఇప్పటి వరకు మనుషులు కుక్కల్ని తుపాకీతో కాల్చి చంపిన ఘటనల గురించి చదివాం, విన్నాం. అయితే.. ఓ కుక్క మాత్రం వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపేసింది. కుక్క ఏమిటీ.. గన్ పట్టుకుని కాల్చడం ఏమిటని అంటారా..? కుక్క కావాలని చేయలేదు. పొరబాటున అలా జరిగిపోయింది. ఇందులో చనిపోయిన వ్యక్తి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
30 ఏళ్ల ఓ వ్యక్తి కాన్సాస్‌లో నివాసం ఉండేవాడు. శనివారం అతడు తన కుక్కతో కలిసి వేటకు వెళ్లాడు. పికప్ వ్యాన్‌లో అతడు డ్రైవింగ్ సీటులో కూర్చోగా.. వెనకాల కుక్కను కూర్చోబెట్టాడు. లోడ్ చేసిన తన తుపాకీని కూడా అక్కడే ఉంచాడు. వెనుక ట్రాలీ భాగంలో ఉన్న కుక్క అటు ఇటు తిరుగుతా తుపాకీ ట్రిగ్గర్‌పై కాలు పెట్టింది. అంతే.. క్షణాల్లో తుపాకీ నుంచి దూసుకువచ్చిన గుండు ముందు సీటులో కూర్చున్న యజమానికి తగింది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మరణించాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీన్ని వేటకు సంబంధించిన ప్రమాదంగా బావిస్తున్నట్లు సమ్నర్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
కాగా.. ఆ కుక్క కు అతడు యజమానా..? కాదా అన్నది పోలీసులు చెప్పలేదు.