అమానుషం.. కడుపులో బిడ్డను అబ్బాయిగా మారుస్తానంటూ.. గర్భిణి తలకు మేకు
Pakistani pregnant woman gets nail hammered into head in the hope for a boy.మగవారితో పాటు ఆడవారు అన్ని
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2022 10:29 AM IST
మగవారితో పాటు ఆడవారు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అయినప్పటికి కొందరిలో ఆడవారిపై ఉన్న వివక్ష పోవడం లేదు. ఫలితంగా బ్రూణ హత్యలు, ఆడ శిశువులను చంపేయడం, దూరంగా పడేయడం వంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక తమకు మగ సంతానమే కావాలని కొందరు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఓ వివాహితకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లులు ఉన్నారు. నాలుగో సారి ఆమె గర్భం దాల్చింది. ఈ సారి కూడా ఆడపిల్ల పుడుతుందనే భయం ఆమెను వెంటాడుతోంది. అయితే.. కడుపులో ఎవరు ఉన్నా సరే మగ బిడ్డగా మారుస్తానని ఓ దొంగ బాబా.. గర్భిణీ తలకు మేకు కొట్టాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పెషావర్ నగరంలో ఓ మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ముగ్గురు ఆడ బిడ్డలు సంతానం. ప్రస్తుతం నాలుగోసారి ఆమె గర్భం దాల్చింది. ఈ సారి కూడా ఆడపిల్ల పుడితే వదిలివేస్తానని భర్త ఆమెను బెదిరించాడు. దీంతో ఈ సారి కూడా అమ్మాయే పడుతుందన్న భయంతో క్షణమొక యుగంలా గడుపుతోంది. ఈ క్రమంలో పరిష్కారం కోసం చాలా ప్రయత్నించింది. చివరకు ఓ బాబా వద్దకు వెళ్లింది. ఆ నకిలీ బాబా ప్రాణాంతకమైన సలహా ఇచ్చాడు. నుదిపై మేకును దించితే.. గర్భంలో అమ్మాయి ఉన్నా అబ్బాయే పుడతాడని సదరు మహిళను నమ్మించాడు.
ప్రస్తుతం ఆ మహిళ ఉన్న పరిస్థితుల్లో ఆ దొంగ బాబాను గుడ్డిగా నమ్మింది. తన తనలో రెండు అంగుళాల మేకు దిగగానే నొప్పితో విలవిల లాడిపోయింది. ఆ మేకును బయటకు లాగేందుకు ఆమె కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు పలించలేదు. వెంటనే ఆమెను ఓ ఆస్పత్రికి తరలించారు. న్యూరాలజిస్ట్ హైదర్ సులేమాన్ ఆమెకు చికిత్స చేసి.. విజయవంతంగా మేకును తీశారు. ఆ మేకు పుర్రలోకి చొచ్చుకెళ్లిందని.. అయితే మెదడును తాకలేదని చెప్పారు. కాగా.. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అయితే.. మహిళ తలలో మేకు ఉన్న ఎక్స్‌రే ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వాళ్ల ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. అప్పటికే నకిలీ బాబా పరారు అయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.