వాట్సాప్‌లో సందేశాలు పంపినందుకు మహిళకు మరణశిక్ష
Pakistan Woman sentenced to death for sending blasphemous messages.వారిద్దరూ మంచి స్నేహితులు అయితే ఏదో
By తోట వంశీ కుమార్
వారిద్దరూ మంచి స్నేహితులు అయితే ఏదో ఓ కారణం చేత వారిద్దరూ విడిపోయారు. దీంతో ఆగ్రహాంతో ఊగిపోయిన సదరు మహిళ అతడికి వాట్సాప్‌లో దైవదూషణ మెసేజ్‌లను పంపించింది. అతడు ఆ మెసేజ్‌లను డిలీట్ చేసి, క్షమాపణలు చెప్పాలని కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో అతడు ఆమెపై పోలీసులకు పిర్యాదు చేశాడు. కోర్టు ఆమెను దోషిగా నిర్థారించింది మరణశిక్షను విధించింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అనికా అటీక్ మరియు ఫరూఖ్ హసనత్ స్నేహితులు, అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఈ విషయంపై చాలా కోపంగా ఉన్న అనికా వాట్సాప్ లో అతనికి 'దూషణ' సందేశాలు పంపింది. మెసేజ్‌లను డిలీట్ చేయమని, ఆమె చేసిన చర్యకు సారీ చెప్పమని అతడు అడిగాడు, అయితే.. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఫరూక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) యొక్క సైబర్ క్రైమ్ విభాగానికి ఆమెపై 2020లో ఫిర్యాదు చేశాడు.
ప్రాథమిక విచారణ అనంతరం ప్రవక్తపై దైవదూషణకు పాల్పడినట్లు, ఇస్లాంను అవమానించడం మరియు సైబర్ క్రైమ్ చట్టాలను ఉల్లంఘించినట్లు నిర్థారించి కేసును నమోదు చేసి విచారణ మరియు ప్రాసిక్యూషన్ కోసం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన రావల్పిండిలోని కోర్టు అనికా అటీక్‌ను దోషిగా నిర్థారించింది. బుధవారం అనికా అటీక్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
పాకిస్తాన్‌లో దైవదూషణ చట్టాలను 1980లలో మాజీ సైనిక నియంత జియా-ఉల్ హక్ రూపొందించారు. ఈ చట్టాలను అనుసరించి ఇప్పటి వరకు ఎవరినీ ఉరి తీయలేదు. అయితే.. దైవదూషణకు పాల్పడ్డారనే అనుమానంతో చాలా మంది వ్యక్తులను కొట్టి చంపారు. కాగా.. గతేడాది సియాల్‌కోట్ నగరంలోని ఒక కర్మాగారంలో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీలంక వ్యక్తిని దైవదూషణ ఆరోపణతో ఓ గుంపు కొట్టి చంపిన సంగతి తెలిసిందే.