పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం, రైలు పట్టాలు తప్పి 25 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దాదాపు 25 మంది మృతిచెందారు. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు.

By Srikanth Gundamalla  Published on  6 Aug 2023 6:13 PM IST
Pakistan, Train Accident, 25 Dead, 80 Injured,

 పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం, రైలు పట్టాలు తప్పి 25 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌ రైలు​ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మృతిచెందారు. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

కరాచీ నుంచి వెయ్యి మందికి పైగా ప్రయాణికులతో రావల్పిండికి వెళ్తుండగా హజారా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సింధ్‌ ప్రావిన్స్‌లోని నవాబ్షా జిల్లా సర్హరి రైల్వే స్టేషన్‌ దగ్గర రైలు పట్టాలు తప్పింది. ఐదు బోగీలు ధ్వంసం అయ్యాయి. ఈ దుర్ఘటనలో

25 మంది ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలను మొదలుపెట్టారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పాకిస్తాన్‌ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ మహమూద్‌ రెహ్మాన్‌ తెలిపారు. క్షతగాత్రులకు తామే ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సుమారు 8 బోగీలు పట్టాలు తప్పాయని.. బ్రేక్‌లు వేయడం ఆలస్యం కావడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. అయితే.. యంత్రాల సాయంతో బోగీలను తొలగిస్తున్నట్లు చెప్పారు రైల్వే అధికారులు. మెకానికల్‌ లోపమా.. లేక ఎవరైనా కావాలని చేశారా అనేది తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

కాగా.. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సింధ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి మురాద్‌ అలీషా సంతాపం తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. తాము కూడా క్షతగాత్రులకు అవసరమైన సాయాన్ని అందిస్తామని మురాద్‌ అలీషా తెలిపారు.

Next Story