పాకిస్తాన్‌లో టెర్రర్ ఎటాక్.. 23 మంది మృతి
పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కాల్పులకు తెగబడ్డారు
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 2:00 PM ISTపాకిస్తాన్‌లో టెర్రర్ ఎటాక్.. 23 మంది మృతి
పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కాల్పులకు తెగబడ్డారు. ముసాఖైల్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు.
ఉగ్రవాదులు ప్రయాణికులను బలవంతంగా బస్సు నుంచి దించారని.. వారి గుర్తింపును పరిశీలించిన తర్వాత కాల్చిచంపారని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. ముసాఖేల్‌లోని రరాషమ్ జిల్లాలో అంతర్-ప్రాంతీయ రహదారిని ఉగ్రవాదులు మోహరించి ఈ దారుణానికి ఒడికట్టారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపి.. అందులోకి అక్రమంగా ప్రవేశించి ప్రయాణికులను కాల్చి చంపారు. అలాగే పది వాహనాలకు నిప్పు పెట్టారని చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతులు పంజాబ్‌కు చెందిన వారని అక్కడి పోలీసులు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఏ గ్రూపు ప్రకటించలేదు.
ఈ ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఖండించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి, సంతాపం తెలిపారు. ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఊరికే వదలిపెట్టదు అని చెప్పారు. ఈ కాల్పుల వెనుక బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) ఉగ్రవాదులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ గ్రూపు చాలా బలంగా ఉంది.