కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్ ప్రస్తుతం పనిచేయడం లేదు. 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చర్యలను ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కుప్పకూలిపోయింది. గురువారం నాడు దారుణమైన ఫలితాన్ని ఇన్వెస్టర్లు చవి చూశారు. అదే శుక్రవారం కూడా కొనసాగుతూ ఉంది. చివరికి స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్ కూడా మొరాయించింది.
గురువారం నాడు ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాల్లోనే పీఎస్ఎక్స్ కీలక సూచీ కేఎస్ఈ-100 ఏకంగా 2.12 శాతం పతనమై 114,740.29 వద్దకు చేరింది. నష్టాల పరంపర కొనసాగుతుండగానే, శుక్రవారం ఉదయం పీఎస్ఎక్స్ వెబ్‌సైట్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లింది. వెబ్‌సైట్ ఎందుకు డౌన్ అయిందనే దానిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.