అదేంటీ.. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవాలి కదా.. హెడ్ లైన్ తప్పుగా ఉందని అనుకుంటూ ఉన్నారా..? అలాంటిదేమీ లేదండీ బాబూ..! గత కొద్దిరోజులుగా పాకిస్థాన్ లో హింస చెలరేగుతూ ఉండగా.. వారిని అదుపు చేయాలని పోలీసులు, సైన్యం ఎంతగానో ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆందోళన కారులు ఏకంగా పోలీసులనే తమ అదుపులోకి తీసుకున్నారు.
ఇస్లామిక్ గ్రూప్ తెహ్రీక్-ఐ-లబైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) లాహోర్‌లో ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని ఆందోళనకారులు బందీలుగా తీసుకున్నారు. టీఎల్‌పీ వద్ద బందీలుగా ఉన్న ఎనిమిది మందిలో ఒక సీనియర్ పోలీసు అధికారి, ఇద్దరు పారామిలిటరీ సిబ్బంది ఉన్నట్టు లాహోర్ పోలీస్ విభాగం చెబుతోంది. టీఎల్పీ మద్దతుదారులు వేలాది లీటర్ల పెట్రోలు ట్యాంకర్లతో వచ్చి భద్రతా సిబ్బందిపై పెట్రోలు బాంబులు విసురుతున్నారని.. ఈ ఘటనలో 11 మంది అధికారులు గాయపడ్డారు. పెద్ద సంఖ్యలోనే పోలీసులు, రేంజర్లను ఆదివారం బందీలుగా తీసుకున్న టీఎల్పీ మద్దతుదారులు సాయంత్రానికి కొందర్ని వదిలిపెట్టారు.
పోలీసుల కాల్పుల్లో తమ కార్యకర్తలు నలుగురు చనిపోయారని, పలువురు గాయపడ్డారని టీఎల్‌పీ నాయకులు ఆరోపించారు. ఫ్రెంచ్ రాయబారులను దేశం నుంచి వెళ్లగొట్టేవరకూ తమ ఆందోళనలు విరమించే ప్రసక్తేలేదని టీఎల్పీ నేతలు అంటున్నారు. తాము శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నామని.. పోలీసులే తమపై దాడిచేశారని మండిపడ్డారు. 12 మంది భద్రతా సిబ్బందిని అపహరించిన ఆందోళనకారులు లాహోర్‌లోని టీఎల్పీ మసీదులో బంధించారు. వారిని విడిపించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది.